బహుళజాతి కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్
సెయింట్ పీటర్స్‌బర్గ్(రష్యా): కంపెనీల ఆదాయాల తరలింపునకు సంబంధించి సమర్ధవంతమైన పన్నుల విధానాన్ని అమలు చేయడం కీలక సవాలుగా నిలుస్తున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిసారించింది. పన్ను ఎగవేతలు, పన్నులను తప్పించుకోవడం కోసం కంపెనీలు చేపట్టే హానికరమైన విధానాలకు అడ్డుకట్టవేయడానికి నిబంధనలను మార్చాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సహా జీ20 దేశాధినేతలు అంగీకరించారు. శుక్రవారం సదస్సు ముగింపు సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో ఈ అంశాన్ని కూడా చేర్చారు.
బహుళజాతి కంపెనీ(ఎంఎన్‌సీ)లు తమ లాభాలను తక్కువ పన్నులున్న దేశాల్లోని అనుబంధ సంస్థలకు కృత్రిమంగా తరలించి, పన్నుల భారాన్ని తగ్గించుకునే చర్యలను అనుమతించకుండా పన్నుల నిబంధనలను మార్చాలనేది తీర్మానంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం. సీమాంతర పన్ను ఎగవేతలు, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం వంటివి పన్నుల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలేలా చేస్తున్నాయని జీ20 దేశాలు తీర్మానించాయి. మొత్తం 27 పేజీల తీర్మానంలో బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిప్టింగ్(బీఈపీఎస్)ను ఎదుర్కోవడానికి సంబంధించిన అంశానికే రెండు పేజీలను కేటాయించడం గమనార్హం.
పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట, పన్ను విధానాల్లో పారదర్శకత, సమాచారాన్ని ఆటోమేటిక్‌గా పంచుకోవడం వంటివి బీఈపీఎస్ ప్రధానోద్దేశం. ఏదైనా ఎంఎన్‌సీ ఎక్కడైతే తన కార్యకలాపాలను ప్రధానంగా చేపడుతోందో, సంపదను సృష్టించడం ద్వారా లాభాలను ఆర్జిస్తుందో అక్కడే పన్నులను చెల్లించడం అనేది ముఖ్యమని తీర్మానంలో స్పష్టం చేశారు. కాగా, జీ20లో ఈ తీర్మానం భారత్ వాదనలను ప్రతిబింబించిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. తమ దేశంలో కార్యకలాపాల ద్వారా ఆర్జించే లాభాలపై పన్నుల విధింపు అనేది ఆ దేశానికి ఉన్న హక్కు అని, ఇది ఆమోదనీయ సూత్రమన్నారు.
కరెన్సీ ఒడిదుడుకులపై భారత్ ఆందోళనలకు ప్రాధాన్యం...
విదేశీ నిధుల ప్రవాహాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, కరెన్సీ రేట్లలో అసంబద్ధమైన కదలికల కారణంగా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న భారత్ అందోళనలకు జీ20 తీర్మానం ప్రాధాన్యం లభించింది. కరెన్సీ ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం పటిష్టమైన పాలసీలను తీసుకురావాలన్న భారత్ సూచనలను పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యల ప్రతికూల ప్రభావం వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడకుండా చర్యలకు పిలుపునిచ్చింది. ప్రపంచ వృద్ధికి చోదోడుగా, ఆర్థిక స్థిరీకరణకోసం అన్ని దేశాలు తమ పాలసీల అమలువిషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని జీ20 తీర్మానంలో పేర్కొన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ ఘోరంగా కుప్పకూలి తాజాగా 68.80కి పడిపోయిన నేపథ్యంలో భారత్ జీ20 సదస్సులో ఈ అంశాలను లేవనెత్తింది. ప్రధానంగా అమెరికాలో ఉద్దీపనల ఉపసంహరణ భయాలతో విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్తాయనే ఆందోళనలు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన ట్రిగ్గర్‌గా నిలిచాయి. 2008నాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంపన్న దేశాలు ప్రకటించిన సహాయ ప్యాకేజీల ఉపసంహరణ విషయంలో క్రమబద్ధమైన విధానం అవసరమని జీ20 సదస్సులో మన్మోహన్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
నిపుణుల రాకపోకలపై నియంత్రణలు వద్దు: మన్మోహన్
వివిధ రంగాల్లోని నిపుణులు అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేసేలా సానుకూల పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నిపుణుల రాకపోకలకు అడ్డుకట్టవేసేలా కొన్ని దేశాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు సరికాదని, దీనివల్ల రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలను వెనక్కితీసుకోవాలని పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో రెండో వర్కింగ్ సెషన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యోగాల కల్పనకు వీలుగా మౌలిక సదుపాయాలను పెంచేందుకు వినూత్న ఫైనాన్సింగ్ స్కీమ్‌లు అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు. అత్యున్నత నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగులు అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేందుకు వీలుకల్పించడం చాలా ముఖ్యమని, ప్రపంచ దేశాల మధ్య సమగ్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు.