భారత్ నంబర్ 2
న్యూఢిల్లీ: భారత్ మరో విషయంలో ముందడుగు వేసింది. ఇప్పటికే వ్యాపార సులభతర నిర్వహణ, వినియోగదారుల విశ్వాస సూచీల్లో తన స్థానాలను మెరుగుపరచుకున్న భారత్, తాజాగా వ్యాపార ఆశావాదంలోనూ ప్రపంచంలో నంబర్ 2 స్థానానికి చేరుకుంది. విధానపరమైన సంస్కరణలు, త్వరలోనే జీఎస్టీ పట్టాలెక్కనుండటం వంటి సానుకూలతలతో సూచీలో ఓ మెట్టు పెకైక్కింది. ఈ మేరకు గ్రాంట్ థార్న్‌టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఆశావహ సూచీలో భారత్ రెండో స్థానంలో ఉంది.
అంతకుముందు త్రైమాసికంలో మన దేశం మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపడింది. ఇండోనేసియా తాజాగా మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆశావహ సూచీలో భారత్ ముందంజ వేయడంపై గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్ హరీష్ మాట్లాడుతూ... ఇది ప్రభుత్వ సంస్కరణల అంజెడాను, వ్యాపార వాతావరణం మెరుగుపరిచే విషయంలో తీసుకునే చర్యల్ని ప్రతిఫలిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, చర్యలు, బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాల మెరుగుపై దృష్టి సారించడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ఆశాకిరణంగా మార్చాయని హరీష్ పేర్కొన్నారు.
ఉద్యోగుల అంచనాలు పెరగడం కూడా వ్యాపార ఆశావాదం మెరుగుపడడానికి తోడ్పడింది. ఉద్యోగుల అంచనాల విషయంలో సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. 36 దేశాల్లో 2,500 మందిపై సర్వే నిర్వహించి, వచ్చిన అభిప్రాయాల ఆధారంగా థార్న్‌టన్ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే వ్యాపార ఆశావాదం 33 శాతంగా ఉంది. జూలై త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం మెరుగుపడింది. కానీ, గతేడాదితో పోల్చి చూస్తే 11 శాతం పారుుంట్ల మేర తగ్గినట్టు తెలుస్తోంది.