దూసుకెళ్లిన అగ్ని-3
భువనేశ్వర్: భారత అమ్ముల పొదిలోని విలువైన అణు అస్త్రం అగ్ని క్షిఫణి మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. సాధారణ పరీక్షల్లో భాగంగా డీఆర్డీవో గురువారం ఒడిశాతీరంలోని వీలర్ ఐలాండ్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నాలుగో ప్రయోగ క్షేత్రం నుంచి ఉదయం 9.55గంటలకు అగ్ని క్షిపణి-3ని పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మేరకు డీఆర్డీవో అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించిన ఈ క్షిపణి దాదాపు 3వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే సామర్ధ్యం కలది. ఈ సందర్భంగా టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ అగ్ని-3క్షిపణి 1.5 టన్నుల సాంప్రదాయ, అణు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని చెప్పారు. ఇక ఈ క్షిపణి 16 మీటర్ల పొడవును కలిగిఉండి దాదాపు 48 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో రెండు దశల సాంధ్ర ఇంధనం నింపి ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ క్షిపణిని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. మరోపక్క, అగ్ని మిస్సైల్కు పోటీగా పాకిస్థాన్ గురువారమే ఘోరీ బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించింది.