స్మార్ట్ సిటీల కోసం టాస్క్‌ఫోర్స్
వైజాగ్, అజ్మీర్, అలహాబాద్‌ల కోసం కార్యాచరణ ప్రణాళిక
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), అజ్మీర్(రాజస్తాన్), అలహాబాద్(ఉత్తరప్రదేశ్) నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఆ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్కర్‌ల మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరాల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేసి ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్‌టీడీఏ) ప్రతినిధులు ఉంటారు.
ఆయా టాస్క్‌ఫోర్స్ కమిటీలు సంబంధిత నగరాల నిర్ధిష్ట లక్షణాలు, ప్రాజెక్టు అవసరాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం రాబడి నమూనాలు తదితర అంశాలను చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశాఖ, అజ్మీర్, అలహాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు మూడు రాష్ట్రాలతో జనవరి 25న యూఎస్‌టీడీఏ ఒప్పందం కుదుర్చుకుందని పెన్నీ ప్రిజ్కర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులతో మాట్లాడానన్నారు. తాజా పరిణామాలతో స్మార్ట్ సిటీల స్వప్నం వాస్తవ రూపం దాల్చనుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎఫ్‌డీఐ లేదా ఎఫ్‌ఐఐల ద్వారా సేకరిస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో కేంద్రం తరపున పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, ప్రవీణ్ ప్రకాశ్‌లు ప్రాతినిథ్యం వహిస్తారని వివరించారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు వెంకయ్యనాయుడు ఫోన్‌లో వివరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా త్వరలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో రాష్ట్రం తరపున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు విశాఖ మున్సిపల్ కమిషనర్, పురపాలన కార్యదర్శి ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలిపారని వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. విశాఖపట్నం విద్యార్థి చెక్కపై రూపొందించిన నరేంద్ర మోదీ, ఒబామాల కరచాలనం చిత్రాన్ని సమావేశం అనంతరం పెన్నీకి వెంకయ్యనాయుడు బహూకరించారు.