ఆనాటి చేదు జ్ఞాపకం!
లండన్: కాలంతో పాటు కరిగిపోని కొన్ని చేదు జ్ఞాపకాలు మన కళ్లు ముందు కదలాడితే అవి చాలా బాధాకరంగా ఉంటాయి. అటువంటి కన్నీటి జ్ఞాపకమే భారత సంతతి ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత అనితా రాణికి తారసపడింది. ఇందుకు బీబీసీ నిర్వహించిన ఓ కార్యక్రమమే కారణం.1947 వరకూ బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే క్రమంలో అనితా రాణి కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని విషాదకర పరిస్థితులు బీబీసీ షో ద్వారా తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.సెలబ్రిటీల పూర్వీకుల జీవితాల్లో కొన్ని రహస్యాలను తెలియజెప్పే 'హూ డూ యూ థింక్ యూ ఆర్? అనే పేరుతో బీబీసీ నిర్వహించిన షోతో అనితా రాణి తన కుటుంబ పూర్వ స్థితి గురించి తెలుసుకుని కలత చెందారు.
ఆనాటి బ్రిటీష్ పాలనలో అనితా రాణి తాతయ్య శాంతా సింగ్ జవానుగా పని చేసేవారు. శాంతా సింగ్ కుటుంబ పోషణలో భాగంగా ఉన్న ఊరికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పని చేసేవాడు. అయితే అదే సమయంలో దేశ విభజన కోసం జరిగిన అల్లర్లు తారాస్థాయికి చేరాయి. ఆ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోలేక పోయిన శాంతా సింగ్ భార్య ప్రీతమ్ కౌర్ ను కొంతమంది ఆందోళన కారులు బావిలోకి తోసివేయడంతో మృతిచెందింది. ఈ ఘటనలో ప్రీతమ్ తన ఏడేళ్ల కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా, అమ్మమ్మ ప్రీతమ్ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు కొంతవరకూ తెలిసినా.. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి కూడా మృతిచెందిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదట .ఈ విషయాన్ని బీబీసీ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్న అనితా రాణి ఆవేదన చెందారు. ఆనాటి చేదు జ్ఞాపకాన్ని తెలుసుకున్న అనితా రాణి ఉట్టిపడుతున్నకన్నీటిని దాచిపెట్టుకున్నారు. ఈ షో అక్టోబర్ 1 వ తేదీన బీబీసీలో ప్రసారం కానుంది.
అనితా రాణి తల్లి సిక్కు మతానికి చెందిన వ్యక్తి కాగా, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. లండన్ లోని బ్రాండ్ ఫోర్డ్ లో పుట్టిన అనితా రాణి.. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ నుంచి బ్రాడ్ కాస్టింగ్ లో డిగ్రీ చదివారు. తన 14 ఏట సిటీ సన్ రైజ్ రేడియోలో కెరీర్ ను ఆరంభించిన అనితా రాణి.. ఆ తరువాత ఛానల్ ఫైవ్, స్కై స్పోర్ట్స్, ఛానల్ ఫోర్, బీబీసీ టూ, బీబీసీ త్రీ, బీబీసీ ఆసియన్ నెట్ వర్క్ లలో జర్నలిస్టుగా పనిచేశారు.