- ఏడాదిన్నపాటు వేధించిన సవతి తల్లికి 25 ఏళ్ల జైలుశిక్ష
వాషింగ్టన్: సవతి కూతురి పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా అమానుషంగా హింసించిందో ఓ మహాతల్లి. అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికకు ఏడాదిన్నరపాటు అన్నం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో మాడ్చివేసింది. అంతేకాకుండా చిన్నారిని చితకబాది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసింది. భారత సంసతికి చెందిన ఆ సవతి తల్లి పాపం పండింది. అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
తన సవతి కూతురు మాయా రతన్‌ను తీవ్రంగా చిత్రవధ చేసిన కేసులో షీతల్ రాతన్‌ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. 2014లో షీతల్ చిన్నారి మణికట్టును దారుణంగా కట్‌చేసి.. చిత్రహింసలు పెట్టిందని, దీనివల్ల ఆస్పత్రి పాలైన చిన్నారి దేహంపై ఇప్పటికీ సవతి తల్లి కొట్టిన దెబ్బల గుర్తులు అలాగే ఉన్నాయని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ పేర్కొన్నారు. అమానుషమైన చిత్రహింసలతో చిన్నారి మాయ ప్రాణాలను సవతి తల్లి ప్రమాదంలో పడేసిందని, ఎవ్వరూ కూడా చిన్నారుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించకూడదని, ఏ చిన్నారికి ఇలాంటి అవస్థ రాకూడని జడ్జి తీర్పు వెలువరిస్తూ పేర్కొన్నారు.