ఐదున్నర సంవత్సరాలుగా పలుదఫాలు నిరోధించిన 21,000 స్థాయిని మరోసారి పరీక్షించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆపైన స్థిరపడలేక వెనుతిరిగింది. సహజంగానే ఈస్థాయి వద్ద షేర్ల సరఫరా అధికంగా వుంటుంది. అందువల్ల ఈ స్థాయికి అటూఇటూగా కొన్ని రోజులు లేదా వారాలు సూచీ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలుంటారు. అయితే 2010 నవంబర్‌లో సైతం కొద్దిరోజులు ఈ స్థాయి సమీపంలోనే సెన్సెక్స్ స్వల్ప హెచ్చుతగ్గులకులోనై, అటుతర్వాత పతనమయ్యింది. అలా పతనమయ్యే ప్రమాదం ఈ దఫా తక్కువని, కనాల్సిడేషన్ తర్వాత గరిష్ట నిరోధస్థాయిని అధిగమించవచ్చని ప్రస్తుత మార్కెట్లో ట్రేడింగ్ టర్నోవర్ సంకేతాలిస్తున్నది. అప్పటిలా కాకుండా సెన్సెక్స్ బ్రేక్‌అవుట్ జరపాలంటే రానున్న రోజుల్లో 20,150-20,050 మద్దతుశ్రేణిని పరిరక్షించుకోవాల్సివుంటుంది.
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా 21,000 స్థాయి బీఎస్‌ఈ సెన్సెక్స్‌కు అవరోధం కల్పించడంతో అక్టోబర్ 25తో ముగిసిన వారంలో చివరకు 20,684 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంతక్రితంవారంతో పోలిస్తే 199 పాయింట్ల నష్టపోయింది. ఈ వారం ఆర్‌బీఐ పాలసీ సమీక్ష తర్వాత అప్‌ట్రెండ్ మొదలైతే వేగంగా 21,000 స్థాయిని మరోదఫా అధిగమించవచ్చు. 21,108 స్థాయి వద్ద ఎదురయ్యే అవరోధాన్ని దాటితే ఆల్‌టైమ్ గరిష్టస్థాయి అయిన 21,206 పాయింట్ల వద్దకు పరుగులు తీయువచ్చు.
ఎన్నో సంవత్సరాల నుంచి సెన్సెక్స్‌ను అడ్డుకుంటున్న ఈ కీలకమైన నిరోధాల వద్ద సూచీకి వేగంలోపిస్తే, అమ్మకాలు వెల్లువెత్తి వెనుతిరిగే ప్రమాదం వుంటుంది. పై అవరోధాల్ని భారీ టర్నోవర్‌తో సెన్సెక్స్ దాటగలిగితే వచ్చే కొద్ది వారాల్లో 22,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించే ఛాన్స్ వుంటుంది. పాలసీ విధానం వెలువడిన తర్వాత డౌన్‌ట్రెండ్ మొదలైతే తక్షణ మద్దతు 20,370 స్థాయి వద్ద లభిస్తున్నది. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,150-20,050 పాయింట్ల శ్రేణి వద్దకు సెన్సెక్స్ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నంతవరకూ సమీప భవిష్యత్తులో సెన్సెక్స్ కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు వుంటాయి.
ప్రధాన మద్దతు 6,030
టెక్నికల్ చార్టుల ప్రకారం 6,230-6,257 శ్రేణి ఎ నిఫ్టీకి డేంజర్‌జోన్‌గా పరిణమిస్తుందంటూ గత వా రం సూచించిన రీతిలోనే అక్టోబర్ 25తో ముగిసిన వారంలో 6,252 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత సూచీ వెనుతిరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 6,145 వద్ద ముగిసింది. ఈ వారం ఆర్‌బీఐ నుంచి పాజిటివ్ వార్త ఎదైనా వెలువడితే నిఫ్టీ మరోదఫా వేగంగా 6,250 స్థాయిని చేరొచ్చు. ఈ నిరోధస్థాయిని అధిగమించి, నిలదొక్కుకోగలిగితే 6,338 వద్దకు చేరొచ్చు. అటుపై 2008 జనవరి 8నాటి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి అయిన 6,357 స్థాయి నిఫ్టీకి గట్టి అవరోధం కల్పించవచ్చు.
ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ టర్నోవర్‌తో దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానానికే కట్టుబడితే నిఫ్టీ తక్షణ మద్దతు 6,030 వద్దకు క్షీణించొచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 5,980-5,950 శ్రేణి వద్ద మరో మద్దతు లభిస్తోంది. ఈ వారం అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియునున్న సందర్భంగా 6,000 స్ట్రయిక్ వద్ద మాత్రమే పుట్ బిల్డప్ (62 లక్షల షేర్ల బిల్డప్) కాస్త ఎక్కువగా వుంది. ఈ స్థాయిని దిగువవైపుగా అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 5,850 స్థాయికీ తగ్గే ప్రమాదం వుంటుంది. కానీ 6,200, 6,300 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ బలహీనంగా వున్నందున అప్‌ట్రెండ్ మొదలైతే ఈ రెండు స్థాయిల్ని వేగంగా దాటే ఛాన్స్ కూడా వుంటుంది.
బ్యాంక్ నిఫ్టీ మద్దతు 10,700
ఈ మంగళవారం ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచొన్న అంచనాలు మార్కెట్లో ఉన్నా, బ్యాంకింగ్ షేర్లు 4 నెలల గరిష్టస్థాయిలోనే ట్రేడ్‌అవుతూ వున్నాయి. ప్రధాన సూచీ నిఫ్టీ అప్‌ట్రెండ్‌కు ప్రధానపాత్ర పోషించిన ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు ఇప్పుడు వెనకడుగువేస్తుండగా, నిఫ్టీలో 30% వరకూ వెయిటేజి వున్న బ్యాంకింగ్ షేర్లు ప్రధాన సూచీ 6,100 పాయింట్లపైన స్థిరపడేందుకు కారణవువుతున్నారు. ఈ కారణంగా రానున్న రోజుల్లో నిఫ్టీ ట్రెండ్‌ను బ్యాంక్ నిఫ్టీ నిర్దేశించవచ్చు.
10,700 పాయింట్ల సమీపంలో స్పాట్ బ్యాంక్ నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఆర్‌బీఐ పాలసీ సందర్భంగా ఈ మద్దతును పరిరక్షించుకుంటే 11,200-11,350 శ్రేణివరకూ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ జరపవచ్చు. ఈ కీలక నిరోధశ్రేణిని దాటితే కొద్దివారాల్లో 13,000 పాయింట్ల స్థాయివరకూ కూడా పెరిగే అవకాశాలుంటారు. 10,700 మద్దతుస్థాయిని కోల్పోతే 10,300 పాయింట్ల స్థాయికి వెనువెంటనే పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయి దిగువన స్థిరపడితే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుత అప్‌ట్రెండ్ ముగిసినట్లేనని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నారు.
- పి. సత్యప్రసాద్
మార్కెట్ పంచాంగం
Published Mon, Oct 28 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement