మార్కెట్ పంచాంగం
ఇటు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం, అటు అమెరికా మార్కెట్లో శుక్రవారం పెద్ద ర్యాలీ జరగడంవల్ల ఈ వారం మన స్టాక్ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలవుతాయనడంలో సందేహం లేదు. అయితే తర్వాత నిలదొక్కుకోవడమనేది ఇన్వెస్టర్ల తక్షణ వ్యవహారశైలిపై ఆధారపడి వుంటుంది. ఈ వారం ఇన్వెస్టర్ల ధోరణి నాలుగు కోణాల్లో వుండవచ్చు. అవి.... 1. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్ని వివిధ ఛానళ్లలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నందున, ఈ వారం లాభాల స్వీకరణ జరగడం.... 2. వచ్చే లోక్‌సభ ఫలితాలపై తాజా అంచనాలతో గతవారపు అప్‌ట్రెండ్ కొనసాగడం. 3. అమెరికాలో నిరుద్యోగం రేటు 7 శాతం కనిష్టస్థాయికి తగ్గడంతో జరిగిన అక్కడి ర్యాలీ ప్రభావంతో పెట్టుబడుల జోరు పెరగడం. 4. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న పలు సంకేతాలు ఇటీవల వెలువడుతున్నందున, ఫెడరల్ రిజర్వ్ నిధుల ప్రవాహాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టవచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడం. ఇక మార్కెట్ సాంకేతిక అంశాలకొస్తే.....
నిఫ్టీ కదలికలు కీలకం....
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని నెలరోజుల క్రితమే చేరినందున, ఇప్పుడా సూచీ సాధించే రికార్డుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు. సెన్సెక్స్‌కంటే అధికంగా ట్రేడయ్యే నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటితేనే భారత్‌లో దీర్ఘకాలిక బుల్ ట్రెండ్ బలపడే అవకాశం వుంటుంది. డెరివేటివ్ ట్రేడింగ్ పొజిషన్లు ఎక్కువగా వుండే ఈ సూచీ కొత్త రికార్డును సృష్టిస్తేనే మరిన్ని పెట్టుబడులురావడం, మరింత షార్ట్ కవరింగ్ జరగడం ద్వారా మొత్తంగా మార్కెట్ తీరే మారిపోతుంది. ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరలేకపోతున్నదని పసిగట్టిన మరుక్షణమే అటు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఇటు బేర్స్ షార్టింగ్ కార్యకలాపాలు మొదలైపోతాయి. నవంబర్ తొలివారంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తృ టిలో ఆ ఛాన్స్ మిస్‌కావడంతో అప్పుడు జరిగిందదే. 2008 జనవరి 8నాటి రికార్డుస్థాయి 6,357 పాయింట్లుకాగా, గత నవంబర్ 3న 6,343 స్థాయి నుంచి నిఫ్టీ వెనుతిరిగింది. తాజాగా కొత్త రికార్డుకోసం నిఫ్టీ మరో ప్రయత్నం చేస్తున్నది. ఈ వారం 6,357 స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించి, స్థిరపడితేనే భారత్ మార్కెట్ మళ్లీ దీర్ఘకాలిక బుల్ కక్ష్యలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది.
నిఫ్టీ తక్షణ నిరోధం 6,343
డిసెంబర్6తో ముగిసినవారంలో 6,300 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 84 పారుుంట్ల లాభంతో 6,260 వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే తక్షణ అవరోధం నవంబర్ 3 నాటి 6,343 స్థాయి వద్ద ఎదురవుతున్నది. ఈ స్థాయిని దాటితే 6,357 స్థాయి తదుపరి నిరోధం. ఈ రెండు అడ్డంకుల్ని గ్యాప్‌అప్‌లోనే అధిగమించగలిగితే రానున్న రోజుల్లో అతిపెద్ద ర్యాలీని అంచనా వేయొచ్చు. కేవలం నాలుగైదు వారాల్లో 7,000 పాయింట్లస్థాయిని దాటినా ఆశ్చర్యంలేదు. తొలుత 6,357పైన వేగంగా 6,410 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే కొద్దిరోజుల్లో 6,550-6,600 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు.ఈ వారం ప్రధమార్థంలో తొలి రెండు అవరోధాల్ని అధిగమించలేకపోతే వేగంగా 6,150 మద్దతుస్థాయికి తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోయి ముగిస్తే రెండు వారాలపాటు మద్దతునిచ్చిన 5,972 స్థాయే ప్రధానం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే మార్కెట్ మళ్లీ బేర్ క క్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.
సెన్సెక్స్ తక్షణ నిరోధం 21,320
డిసెంబర్ 6తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 21,165 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 204 పాయింట్ల పెరుగుదలతో 20,996 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో సెన్సెక్స్ మొదలైతే తక్షణ నిరోధం 21,320 స్థాయి(దీపావళినాటి రికార్డుస్థాయి) వద్ద ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితే 21,500-21,600 శ్రేణికి చేరవచ్చు. రానున్న రోజుల్లో కొత్త గరిష్టస్థాయిని సెన్సెక్స్ పరిరక్షించుకోగలిగితే క్రమేపీ 22,498 లక్ష్యాన్ని చేరవచ్చు. తొలి అవరోధాన్ని దాటలేకపోతే 20,674 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే 20,350 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన మరోదఫా 20,137 స్థాయిని పరీక్షించవచ్చు.
- పి. సత్యప్రసాద్