లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది.
ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది.
గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈలోని సెక్టార్ ఇండెక్స్‌ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు.
సూచీల దూకుడుకు కారణాలివే...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి.
అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్‌ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు.
చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్
మార్కెట్లో మరిన్ని విశేషాలు...
భారతీ ఎయిర్‌టెల్ బీఎస్‌ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం.
పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది.
భారత్‌లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్‌స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment