విద్యా వికాసానికి అసహన బంధనాలు
ప్రపంచంలో తొలి 500 వర్సిటీల్లో భారత వర్సిటీలకు చోటు లేదు
ప్రమాణాలు పెంచే చర్యలు నిల్.. నిధులు, పోస్టుల కోతలు ఫుల్
వర్సిటీల్లో అసహన నిరసనలు.. భావజాలాల మధ్య భౌతిక ఘర్షణలు
భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామిక చర్చకు పాతర
సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఉన్నత విద్య: విద్యావేత్తల ఆందోళన
భారత ఉన్నత విద్యారంగం ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని విద్యావేత్తలు, మేధావుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పోటీలో మన విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి అనేది చూస్తే.. అగ్రస్థాయిలోని తొలి 500 విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్‌సీ, ఐఐటీలకు మినహా దేనికీ స్థానం లభించలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలో మరింతగా మెరుగుపడడానికి కృషి జరగాల్సి ఉండగా.. ఇటీవలి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి విరుద్ధ భావనలు, సిద్ధాంతాలపైన అయినా మేధోమధనానికి, భావప్రకటనా స్వాతంత్య్రానికి, స్వేచ్ఛాయుత చర్చలకు ప్రజాస్వామిక వేదికలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. ‘కుడి ఎడమ’ల భావోద్వేగాల అసహనాలకు భౌతిక ఘర్షణలకు కేంద్రాలుగా మారుతుండటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సైద్ధాంతిక పరిశోధనలకు నిధుల కేటాయింపులో కోత పెట్టడం, ఆధికారంలో ఉన్నవారి భావజాలానికి విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేసే అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం వంటి చర్యలతో విద్యారంగంలో ప్రమాణాలు మరింత క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రమాణాల వెతలు.. కోతల మోతలు..: భారతదేశంలో ఉన్నత విద్యారంగం స్వాతంత్య్రానంతరం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రస్తుతం దాదాపు 750 విశ్వవిద్యాలయాలు, 35,000 కళాశాలలు, మూడు కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ.. వీటిలో ఏవీ ప్రపంచంలో అగ్రగామి సంస్థలుగా పోటీపడగల స్థాయిలో లేవు. తాజాగా ప్రకటించిన క్యూఎస్ ప్రపంచ వర్సిటీల జాబితాలో తొలి 150 స్థానాల్లో, టైమ్స్ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో కానీ.. తొలి 200 స్థానాల్లో భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యా సంస్థకూ చోటు దక్కలేదు. ఐఐఎస్‌సీ, ఐఐటీలు కొన్నిటికి మాత్రం 150, 200 ర్యాంకుల తర్వాత స్థానాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో ఆయా విద్యాసంస్థల ప్రమాణాలను అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా పెంచేందుకు కృషి చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పరిశోధనలకు కేటాయించే నిధులకు ఏకంగా 83 శాతం కోతపెట్టారు. 2017-18 విద్యా సంవత్సరానికి చేర్చుకునే పీజీ, పరిశోధన విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సైతం గత నెలలో 25 మంది అధ్యాపకులను విధుల నుంచి తొలగించారు. ఈ చర్యల పట్ల విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
‘భావ ప్రకటన’కు అసహన సంకెళ్లు..: ఇక భావప్రకటనా స్వాతంత్య్రానికి, మేధో మధనానికి కేంద్ర బిందువులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో.. ఆ స్వాతంత్య్రం క్రమంగా క్షీణిస్తుండటం ఉన్నత విద్యారంగంలో చీకటి అలముకునే పరిస్థితులను కల్పిస్తోందని మేధావులు విచారం చెందుతున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2016లో జేఎన్‌యూలో విద్యార్థులు నిర్వహించిన ఒక కార్యక్రమం.. కశ్మీర్ అంశంపై రాజకీయ వివాదంగా మారడంతో లెఫ్ట్ రైట్ విద్యార్థి విభాగాల మధ్య పోటాపోటీ నిరసనలు పెల్లుబికాయి. విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌ను బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో దేశద్రోహం ఆరోపణల మీద అరెస్ట్ కూడా చేశారు. ఆ పరిణామాలు జాతీయవాదం మీద దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. 2016లో కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేములకు సంఘీభావంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులను ఈ ఏడాది పరీక్షలు రాయకుండా నిషేధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌జాస్ కాలేజీలో పలువురు విద్యార్థులు ‘నిరసనల సంస్కృతి’ పేరుతో తలపెట్టిన ఒక సదస్సుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంస్థ హింసాత్మక నిరసనలకు దిగింది. గత ఏడాది జేఎన్‌యూ వివాదంలో ఏబీవీపీ అభ్యంతరాలకు గురైన ఉమర్‌ఖాలిద్, షీలా రషీద్‌లను ఈ సదస్సుకు వక్తలుగా ఆహ్వానించడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు చెందిన ఏబీవీపీకి ఆగ్రహం తెప్పించింది. హింసాత్మక నిరసనల కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. నిజానికి ఇటువంటి భౌతిక సంఘర్షణలు, విపరీత నిరసనలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. రామ్‌జాస్‌కళాశాల ఘటనకు వారం ముందు.. జోధ్‌పూర్‌లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజశ్రీ రాణావత్.. వర్సిటీలో ఒక ప్రసంగం ఇవ్వడం కోసం జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితా మీనన్‌ను ఆహ్వానించారు. దీనిపై ఏబీవీపీ నిరసన చేపట్టడంతో ప్రొఫెసర్ రాజశ్రీని సస్పెండ్ చేశారు. ఆమె కశ్మీర్ మీద, అక్కడ భారత సైన్యం పాత్ర మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు.. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలపై రూపొందించిన ఒక డాక్యుమెంటరీని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించడాన్ని ఏబీవీపీ అడ్డుకుంది. ఈ పరిణామాలతో వర్సిటీల స్వయంప్రతిపత్తి, భావప్రకటనా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యయుత చర్చా సంప్రదాయాలు క్షీణించిపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
స్వేచ్ఛా, సహనాలతోనే మేధో వికాసం..: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో మేధోచర్చల సంప్రదాయాన్ని, అసమ్మతి తెలిపే స్వేఛ్చను ధ్వంసం చేసే ఇటువంటి ఘటనలు.. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గణనీయంగా పెరిగాయనేది అందరూ అంగీకరిస్తున్న విషయం. అప్పటివరకూ వామపక్ష భావజాలానికి పట్టుగొమ్మలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘జాతీయవాదం’ అజెండాను విస్తరించేందుకు ప్రభుత్వ పరోక్ష మద్దతుతో ఏబీవీపీ దూకుడుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే.. విద్యారంగం అనేది భిన్న వాదనలు, భిన్నాభిప్రాయాల మధ్య మేధోమధనానికి వేదికగా ఉండాలే కానీ.. భౌతిక సంఘర్షణలకు కేంద్రం కారాదనేది ప్రముఖ విద్యావేత్తల ఉవాచ. ప్రస్తుతం భారత విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగి వికాసం దిశగా పయనించాలంటే.. అన్ని రకాల భావనలనూ అంగీకరించి, దానిపై చర్చించే ప్రజాస్వామిక వైఖరులను పెంపొందించడం ఒక్కటే మార్గమని వారు చెప్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ప్రమాణాలు నిల్.. ఫైటింగ్‌లు ఫుల్
Published Mon, Apr 10 2017 6:13 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
Advertisement
Advertisement