
ఇరాన్ ఉగ్రదాడి; బీభత్సం సృష్టించిన మహిళ
- చారిత్రక ఖొమేనీ స్మారకం వద్ద తననుతాను పేల్చుకున్న మహిళా ఉగ్రవాది
- పార్లమెంట్ భవనంలోకి చొరబడిన ముష్కరుల హతం
- దాడుల్లో ఏడుగురు పౌరులు మృతి.. మా పనేనన్న ఐసిస్
టెహ్రాన్: పవిత్ర రంజాన్ మాసం ఆరంభంలోనే ఇస్లామిక్ దేశం ఇరాన్ రక్తమోడింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సవాలు విసురుతూ ఏకంగా పార్లమెంట్ భవనం సహా పలు చారిత్రక ప్రదేశాల్లో బుధవారం ఉగ్రవాదులు చేశారు. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు కనీసం ఏడుగురు చనిపోయినట్లు సమాచారం.
బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు.. పార్లమెంట్ భవనం, చారిత్రక ప్రార్థనా స్థలాలు, ప్రఖ్యాత ఖొమేని స్మారకం వద్ద ఏకకాలంలో దాడులు చేశారు. ఏకే 47 తుపాకులు పట్టుకులు, పిస్టల్స్ చేతపట్టుకుని పార్లమెంట్ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. అక్కడి ఉద్యోగుల్లో కొంతమందిని చంపి, మరికొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులు తుపాకులతో భవనం కిటికీల వద్ద నిల్చున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. రంగంలోకిదిగిన భద్రతాబలగాలు.. ఉగ్రవాదులను వేటాడి హతమార్చినట్లు తెలిసింది.
మహిళా ఉగ్రవాది విధ్వంసం
చారిత్రక అయతుల్లా ఖొమేనీ స్మారకచిహ్నం వద్ద ఆత్మాహుతిదాడితో బీభత్సం సృష్టించింది ఓ మహిళా ఉగ్రవాది అని తెలియడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. భారీగా పేలుడు పదార్థాలు నింపిన దుస్తులను ధరించిన ఆ మహిళ.. ప్రార్థనా స్థలం వద్ద తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోగా, పదుల మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇది మా పనే: ఐసిస్
షియా దేశమైన ఇరాన్‌లో అలజడి సృష్టించేందుకు సున్నీ ఉగ్రవాదులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నీ ప్రాబల్య ఐసిస్.. చాలా కాలం కిందటే ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంది. బుధవారం నాటి టెహ్రాన్ దాడులు మా పనేనని ఐసిస్ ప్రకటించుకుంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో మితవాది హసన్ రౌహానీ వరుసగా రెండోసారి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక అతివాదులే ఈ పని చేసిఉండొచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు.