ఇరాన్‌ పార్లమెంటుపై ఉగ్ర దాడి | Terror attack on Iran Parliament | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ పార్లమెంటుపై ఉగ్ర దాడి

Published Thu, Jun 8 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

ఇరాన్‌ పార్లమెంటుపై ఉగ్ర దాడి

ఇరాన్‌ పార్లమెంటుపై ఉగ్ర దాడి

ఆత్మాహుతి దాడులతో ఐసిస్‌ బీభత్సం
- 12 మంది మృతి
- దీటుగా బదులిచ్చిన బలగాలు
- ఐదుగంటల్లో ఆపరేషన్‌ పూర్తి.. ఉగ్రవాదుల హతం
 
టెహ్రాన్‌: ఇరాన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుచోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. సాయుధులు, ఆత్మాహుతిదళ ఉగ్రవాదులు ఇరాన్‌ పార్లమెంటు, ఆ దేశ విప్లవనాయకుడు ఆయతుల్లా ఖొమేనీ స్మారక భవనం వద్ద దాడులకు పాల్పడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు ఐసిస్‌ బాధ్యత ప్రకటించుకుంది. అటు ఐదుగంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్‌ బుధవారం విధ్వంసానికి దిగింది.

ఈ దాడిని ఇరాన్‌ సుప్రీమ్‌ లీడర్‌ అయతుల్లా అలీ ఖొమేనీ ఖండించారు. ‘ఈ టపాసుల చప్పుడుతో ఇరాన్‌ ప్రజల మనోబలాన్ని దెబ్బతీయలేరు’ అని అన్నారు. ‘అంతర్జాతీయ సమస్యగా మారిన ఉగ్రవాదంపై ఇరాన్‌ తీరు సుస్పష్టం. ఉగ్రవాదంపై పోరులో ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం తప్పనిసరి’ అని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ స్పష్టం చేశారు.  ఈSదాడిని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌పై ఇది తొలి ఉగ్రదాడి కావటం గమనార్హం.
 
దాడి ఇలా జరిగింది!
ఎప్పటిలాగానే బుధవారం ఇరాన్‌ పార్లమెంటు సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఇంతలోనే బురఖాలు ధరించి పార్లమెంటు కాంప్లెక్సులోకి ప్రవేశించిన నలుగురు సాయుధులు.. లోపలకు వస్తూనే కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాదళ గార్డుతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రయత్నించాయి. లోపలున్న పార్లమెంటు సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. చాలాసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పార్లమెంటు భవనం నాలుగో అంతస్తులోకి చొరబడ్డ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు.

మరికొందరు భద్రతా దళ సభ్యులు హెలికాప్టర్లలో పార్లమెంటు భవనం పైనుంచి లోపలకు ప్రవేశించారు. మొత్తానికి ఆపరేషన్‌ ప్రారంభమైన ఐదుగంటల తర్వాత ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందే టెలిఫోన్, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. దాదాపుగా పార్లమెంటు పై దాడి జరుగుతున్న సమయంలోనే టెహ్రాన్‌లోని ఇస్లామిక్‌ విప్లవనాయకుడు అయతుల్లా రాహుల్లా ఖొమేనీ స్మృతి భవనం లోపలకు కూడా ముగ్గురు సాయుధులు చొరబడ్డారు. వస్తూనే కాల్పులకు తెగబడ్డారు. తోటమాలిని చంపేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వీరిని మట్టుబెట్టాయి. స్మృతి భవనం ఘటనలో ఓ మహిళా ఉగ్రవాది  ఆత్మాహుతి దాడి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ప్రతీకారం తప్పదు
ఐసిస్‌పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ భద్రతాదళాలు స్పష్టం చేశాయి. అమెరికా, సౌదీ అరేబియా కలిసే ఈ దాడికి కుట్రపన్నాయని ఆరోపించాయి. 
 
దాడి సమయంలోనూ సమావేశాలు
పార్లమెంటుపై ఉగ్రదాడి విషయంతెలిసినా లోపలున్న ఎంపీలు ఏమాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజూవారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్టు చేశారు. సమావేశాల్లోనే ఈ దాడిని ఖండించిన స్పీకర్‌ అలీ లారిజానీ.. ఇదో చిన్న ఘటన అని భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రభుత్వం టెహ్రాన్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. గతేడాది జూన్‌లో భారీ ఉగ్రకుట్రను ఇరాన్‌ బలగాలు భగ్నం చేశాయి. అనంతరం విడుదల చేసిన ఓ వీడియోలో ‘ఇరాన్‌ను స్వాధీనం చేసుకుంటాం. అక్కడ సున్నీ రాజ్యాన్ని నెలకొల్పుతాం’ అని ఐసిస్‌ హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement