ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతమంతా నేరాలమయమే.
న్యూఢిల్లీ: ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతమంతా నేరాలమయమే. ఆయన చట్టాలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గైక్వాడ్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆయనేమీ చదువు లేనివాడు కాదు. ఉన్నత విద్యావంతుడు..! ఎంకామ్, బీఎడ్ చేశారు.
గైక్వాడ్ గతంలో రెండుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఉస్మానాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉన్నత విద్య, రాజకీయ నేపథ్యం ఉన్నా.. ఆయన జీవితమంతా వివాదాలు, నేరాలమయం. అభ్యర్థుల నేర, ఆర్థిక వివరాలను పొందుపరిచే మై నేత పోర్టల్ జాబితా ప్రకారం గైక్వాడ్‌పై 12 కేసులున్నాయి. హత్య, దోపిడీ, బెదిరించడం వంటి కేసులున్నాయి. తాజాగా ఎయిరిండియా అధికారిని చెప్పుతో కొట్టి గైక్వాడ్ వార్తల్లోకెక్కాడు.
ఎయిరిండియా అధికారిపై గైక్వాడ్ దాడి చేసిన ఘటనపై శివసేన స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది.