
పారిపోతూ కూడా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ప్యారిస్: ఉగ్రవాద దాడితో ప్యారిస్ లోని విశ్వవిఖ్యాత సందర్శనీయ కేంద్రం ఈఫిల్ టవర్ ను మూసివేశారు. ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. బుధవారం ప్యారిస్ లోని ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
దాడి చేసిన మరుక్షణం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుని నల్ల రంగు కారులో పారిపోయారు. కారులో పారిపోతున్నప్పుడు కూడా రోడ్డుపైనున్నవారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ముష్కర మూకల దాడితో ప్యారిస్ ప్రజలు భీతిల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, కనీసం 9 మంది జర్నలిస్టులున్నట్టు తెలుస్తోంది.