ఓటింగ్ చేపట్టకుండా బడ్జెట్‌ను ఆమోదంపై విపక్షాల ఆగ్రహం
పారిస్: ఫ్రాన్స్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేక తిప్పలు పడుతున్న ప్రధాని మైఖేల్ బార్నర్‌ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిగువసభలో ఓటింగ్ చేపట్టకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు దిగుతున్నాయి. తీర్మానానికి అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, వామపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్‌ఆర్) తదితరాలు మద్దతివ్వనున్నాయి.
ఈ ప్రయత్నాలను బార్నర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ దేశ భవిష్యత్తును పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఇలాంటి పార్టీలను ప్రజలు క్షమిస్తారనుకోను. మా ప్రభుత్వం కూలితే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుంది’’ అని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే గత 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం కూలడం తొలిసారి అవుతుంది.
తాను మాత్రం 2027లో పదవీకాలం పూర్తయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానని ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలితే ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుత పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీలో మేక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి, అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, మరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ లేదు.
అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 574 మంది సభ్యులకుగాను 288 మందికిపైగా సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. అయితే విపక్షాలు రెండూ కలిస్తే వాటి బలం 330కిపైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విద్యుత్‌పై కొత్త పన్నులను తొలగించాలని మరీన్ లీ పెన్ డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment