దేశీ ఐటీ కంపెనీలకు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ3) రాబడుల వృద్ధి అంతంతమాత్రంగానే ఉండొచ్చా? అవుననే అంటున్నారు విశ్లేషకులు.
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ3) రాబడుల వృద్ధి అంతంతమాత్రంగానే ఉండొచ్చా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ఆదాయల్లో 2-4 శాతం మాత్రమే వృద్ధి ఉండొచ్చనేది బ్రోకరేజి సంస్థల అంచనా. ‘అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ సాధారణంగా ఐటీ కంపెనీలకు కాస్త బలహీనంగా ఉంటుంది. క్లయింట్ల దేశాల్లో సంవత్సరాంతపు మూసివేతలు, సెలవుల కారణంగా క్యూ3లో తక్కువ పనిదినాలుంటాయి. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే.. ఈ క్వార్టర్‌లో ఆదాయ వృద్ధి 3.2 శాతానికి పరిమితం కావచ్చు’ అని నొమురా ఈక్విటీ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధిలో టీసీఎస్, విప్రో కాస్త ముందుండొచ్చని... ఇన్ఫీ వెనుకబడొచ్చని అంచనా వేసింది. అయితే, కాగ్నిజంట్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రాలకు క్యూ3 మెరుగ్గా ఉండే అవకాశం ఉందని కూడా నొమురా తెలిపింది.
ఇన్ఫీతో బోణీ... 10న
ఈ నెల 10న ఇన్ఫోసిస్ ఫలితాలతో క్యూ3 ఆర్థిక ఫలితాలు ఆరంభం కానున్నాయి. తర్వాత వరుసలో హెచ్‌సీఎల్ టెక్(16న), విప్రో(17న) ఉన్నాయి. టీసీఎస్ ఇంకా ఫలితాల తేదీని ప్రకటించలేదు. కాగా రిటైల్, తయారీ, సేవలు తదితర రంగాల్లోని కంఎనీల్లో ఐటీ వ్యయాల తగ్గుముఖం, సంవత్సరాంతంలో ప్లాంట్ల మూసివేతలు, తక్కువ పనిదినాల ప్రభావంతో క్యూ3లో ఐటీ కంపెనీల రాబడుల వృద్ధిని తగ్గించవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది.
రూపాయి ప్రభావం కూడా...
గడిచిన మూడునెలల్లో సగటున రూపాయి విలువ కాస్త పెరగడం కూడా ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని, గత త్రైమాసికంతో పోల్చినపుడు ఆపరేటింగ్ మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) మేర తగ్గొచ్చనేది ఏంజెల్ అంచనా. క్యూ3లో రూపాయి ప్రాతిపదికన టాప్ ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 1-3 శాతంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టయర్-2 ఐటీ కంపెనీల విషయంలో ఈ వృద్ధి 0.5-2.7 శాతంగా అంచనా. అయితే, రానున్న క్వార్టర్లలో కంపెనీల పనితీరు బాగానే ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవలకు డిమాండ్ మెరుగుదల కొనసాగవచ్చని కూడా అభిప్రాయపడింది. యూరప్‌లో ఆఫ్‌షోర్ సేవల విస్తరణ, అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ నేపథ్యంలో వ్యయాలు పెరిగొచ్చనే అంచనాలే దీనికి కారణమని తెలిపింది.