న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను చట్టాన్ని అమలు చేసేందుకుకేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులో వేస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో జీఎస్టీ సంబంధిత బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించిన నాలుగు బిల్లులను లోక్‌సభ ముందు ఉంచారు. దీనిపై విపక్ష సభ్యుల సూచలను, సలహాలను ఆయన ఆహ్వానించారు. మార్చి 29 తేదీన జీఎస్‌టీ బిల్లులపై చర్చ జరగనుంది.
అయితే ఈ నాలుగు బిల్లులు ప్రవేశానికి సంబంధించిన సమాచారం అధికారిక జాబితాలో లేదని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీన్ని అడ్డుకోవాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఈ అంశం జాబితాలో లేనప్పటికీ బిల్లుల పరిచయానికి తాను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నాలుగుబిల్లులు సంబంధించిన ముసాయిదా కాపీలను శనివారం పంపిణీ చేశామంటూ ఆర్థికమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అరుణ జైట్లీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
కాగా జీఎస్‌టీకి సంబంధించి ఇప్పటికే అయిదు ముసాయిదా బిల్లులకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.మరోవైపు జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని చెప్తున్న కేంద్రం...ఆ లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.