పోలవరం ప్రాజెక్టు వద్ద టైర్లు కూడా లేకుండా మూలనపడ్డ వాహనం
14 బ్యాంకుల్లో రూ.4,300 కోట్ల రుణం అప్పు చెల్లించకుండా విలాసాలు
హైదరాబాద్: అధికారపార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ అది. పేరు ట్రాన్స్‌ట్రాయ్. పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న ఈ కంపెనీ తాజాగా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కంపెనీల జాబితాలో చేరింది. 14 బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్న ఈ కంపెనీ.. తిరిగి చెల్లిం చకుండా చేతులెత్తేసింది.ఈ పరిస్థితుల్లోనూ ఆ సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో 4 లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. బ్యాంకుల్ని ముంచి విలాసాలకు ఖర్చుపెట్టడం కార్పొరేట్ ప్రపంచంలోనూ చర్చనీయాంశమైంది.
లగ్జరీ కారుకోసం దేనా బ్యాంకులో రుణం తీసుకుని సరిగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు ట్రాన్స్‌ట్రాయ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో మిగతా బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. మొత్తం 14 బ్యాంకులనుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్నట్లు తేల్చాయి. అన్ని బ్యాంకుల్లో ట్రాన్స్‌ట్రాయ్ ఖాతాలను ఎన్‌పీఏ (మొండిబకాయిలు-నాన్ పెర్ఫామింగ్ అసెట్స్)గా ప్రకటించాయి. ఇకమీదట ట్రాన్స్‌ట్రాయ్‌కు రుణాలివ్వరాదని నిర్ణయించాయి.
లగ్జరీ కార్ల కొనుగోలుతో కదిలిన డొంక
లంబొర్గిని హరకన్ కూప్, మెర్సిడెస్ బెంజ్ ఎస్350, బీఎండబ్ల్యూ జెడ్4 ఎస్‌డ్రైవ్.. కార్ల కొనుగోలుకు బీఎండబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సేవల విభాగం ‘అల్ఫెరా ఫైనాన్షియల్ సర్వీసెస్’తో ఈ ఏడాది జనవరి చివరివారంలో ట్రాన్స్‌ట్రాయ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మూడు కార్లకు దేనా బ్యాంకు నుంచి రుణం పొందారు. కార్లు కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈఎంఐ చెల్లించడం మానేశారు.
దీంతో దేనా బ్యాంకు ట్రాన్స్‌ట్రాయ్ ఖాతాను ఎన్‌పీఏగా ప్రకటించింది. దీంతో మిగతా బ్యాంకు లు మేల్కొన్నాయి. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకు నుంచి.. ఇలా మొత్తం 14 బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన విషయాన్ని గుర్తించాయి. సాధారణంగా ఇలా బ్యాంకుల్ని మోసగించకుండా నిరోధించడానికి వీలుగా అన్ని బ్యాంకులు కలసి ‘కన్సార్షియం’గా ఏర్పడి భారీ కంపెనీలకు రుణాలిస్తుంటాయి. కానీ ట్రాన్స్‌ట్రాయ్ విషయంలో ఇందుకు భిన్నంగా రుణాలివ్వడం గమనార్హం.
ఈసురోమంటున్న పోలవరం పనులు
రూ.4 వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్నా వేగంగా పనులు చేసిన చరిత్ర ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. నిబంధనలకు విరుద్ధంగా రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంది. ప్రభుత్వమిచ్చిన అడ్వాన్స్‌కుగాను కంపెనీకి చెందిన యంత్రాలు, వాహనాల పత్రాలను అప్పగించాలని(మార్ట్‌గేజ్) సర్కారు సూచించింది.
అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న యంత్రాలు, వాహనాల పత్రాలన్నింటినీ బ్యాంకులకే మార్ట్‌గేజ్ చేశారు. పోనీ.. తీసుకున్న అడ్వాన్స్ మేరకైనా పనులు చేసిందా? అంటే అదీ లేదు. ఏడాదిగా కనీసం రూ.100 కోట్ల విలువైన పనులూ చేయలేక చతికిలపడింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కిన నేపథ్యంలో.. మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. ఈ సదవకాశాన్నీ వినియోగించుకోకుండా సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. తీరాచూస్తే.. సదరు కాంట్రాక్టర్ బ్యాంకులనుంచి భారీగా రుణం తీసుకొని ఎగనామం పెట్టారు.
ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఒకవైపు ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతూనే, మరోవైపు బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా పోల వరం పనులు జరుగుతున్న ప్రాంతంలో పనిచేస్తున్న వాహనాలు నిర్వహణ లేక మూలన పడుతున్నాయి. సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలివ్వడం లేదు. మరోవైపు బ్యాంకు రుణాలను యాజమాన్యం లగ్జరీ కార్లకు, విలాసాలకు ఖర్చు పెట్టడంపై సంస్థ సిబ్బందిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.