♦ పోలవరంలో ముడుపులు, కమీషన్ల వ్యవహారం
♦ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడానికి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాసులు దండుకొనే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. అందుకు అనుగుణంగానే అంచనా వ్యయాన్ని భారీగా పెంచి, పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. కమీషన్లు, ముడుపులనూ పరిగణనలోకి తీసుకొనే అంచనా వ్యయాన్ని పెంచుతున్నారని నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ వ్యయం సుమారు రూ.200 కోట్లను మూడు రెట్లకు పైగా పెంచి రూ.603 కోట్లు చేయాలని ప్రతిపాదించింది. ఒక్కో పనిని ఒక్కో కంపెనీకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరిట అంచనా వ్యయాన్ని పెంచి సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలేవీ?
ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కింద 110 మీటర్ల కాంక్రీట్ గోడను నిర్మించనున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు లేకుండానే కాంక్రీట్ వాల్ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. భారీ యంత్రం సహాయంతో గోడ పరిమాణం మేర మట్టిని వెలికి తీసి, ఆ గ్యాప్‌లో కాంక్రీట్ వేస్తారు. దీన్ని డయాఫ్రమ్ వాల్ విధానం అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉందని నిరూపించుకున్న తర్వాతే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు అప్పగించారు. తీరా.. పనుల దగ్గరకు వచ్చే సరికి ఆ కంపెనీ చేతులెత్తేసింది. పనులు చేయలేకపోతే కాంట్రాక్టు సంస్థ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి బదులు.. కాంట్రాక్టర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెంచిన నేపథ్యంలో.. నేరుగా టెండర్లు పిలిచి సామర్థ్యం ఉన్న కంపెనీకే పనులు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సూచించారు. టెండర్లు పిలవాలంటే.. ప్రస్తుత కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా.. సొంతపార్టీ ఎంపీని రక్షించి, సబ్ కాంట్రాక్టు పేరిట కమిషన్లు దండుకోవడానికే ప్రభుత్వ పెద్దలు మొగ్గుచూపడం గమనార్హం.
అంచనా పెంచింది.. వంచనకే..!
Published Wed, Oct 7 2015 4:36 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement