స్వామివార్ల యాగశాలలో జపపారాయణ పూజలను చేస్తున్న వేదపండితులు
శ్రీశైలం (కర్నూలు): వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం వేద పండితులు, అర్చకులు జప పారాయణ పూజలను ప్రారంభించారు. ఇవి 12వ తేదీ వరకు కొనసాగుతాయి. సోమవారం ఉదయం స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేశారు. అనంతరం ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు.
సకల జనులు ఆయురారోగ్యంతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పం చెప్పారు. అనంతరం పుణ్యహవచానాన్ని చేసి స్థలశుద్ధి చేశారు. కాగా, బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీమల్లికార్జునస్వామికి సహస్రఘటాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, 11గంటలకు పూర్ణాహుతి, కలశోధ్వాసన, కలశ జలాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) సాగర్‌బాబు తెలిపారు.