
'మా మధ్య బ్రోకర్ అవసరం లేదు'
ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ల స్నేహం 'జయ' కారణంగానే చెడిందట. జయ అంటే జయప్రద అనుకునేరు. ఎంతమాత్రం కాదు. అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కారణంగానే చిరకాల మిత్రుడికి దూరం అయ్యాయని అమర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. తమిద్దరి మధ్య జయ చిచ్చు పెట్టారని మండిపడ్డారు.
ములాయంకు అత్యంత సన్నిహితంగా మెలగిన అమర్ సింగ్ అనూహ్యంగా 2010లో సమాజ్వాది పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారు. తర్వాత వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఇక సమాజ్వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్తో వైరంగా కారణంగా అమర్ సింగ్ స్నేహితురాలు జయప్రద కూడా ములాయంకు దూరయ్యారు. తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో చేరారు.
ఇదిలావుంచితే తాజాగా జయబచ్చన్ పై అమర్ సింగ్ విరుచుకుపడ్డారు. ములాయంతో సంబంధాలు పునరుద్దరించుకోవడానికి తనకు బ్రోకర్ అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. అసలు తన పాత్ర మిత్రుడితో సంబంధాలు దెబ్బతినడానికి జయా బచ్చనే కారణమని వెల్లడించారు. తనకు, ములాయంకు మధ్య జయ మధ్యవర్తిగా వచ్చినప్పటి నుంచే తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. తమ మధ్య సంబంధాలు మళ్లీ చిగురించడానికి ఏ మధ్యవర్తి, బ్రోకర్ అక్కర్లేదని ఘాటుగా విమర్శించారు. అయితే ములాయంకు మళ్లీ దగ్గరయ్యేందుకే అమర్ సింగ్ ఈ పల్లవి అందుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.