ఆస్పత్రిలో అమ్మ: కరువైన పోలీసు సేవలు
ఆస్పత్రిలో అమ్మ: కరువైన పోలీసు సేవలు
Published Thu, Oct 20 2016 1:52 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
చెన్నై : అపోలో ఆస్పత్రిలో అమ్మ.. పోలీస్స్టేషన్లో పోలీసులెక్కడా..అందరూ బందోబస్తు డ్యూటీగా అపోలో ఆస్పత్రి ఆవరణలోనే. ప్రజా ఫిర్యాదులను సేకరించడానికి కాని, విచారించడానికి కాని కనీసం పోలీసులే లేరు. ప్రజలు వెళ్లి పోలీస్స్టేషన్లలో తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నా అసలు పట్టించుకునే దిక్కులేదు. అందరూ ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలోనే బందోబస్తు డ్యూటీలో ఉన్నట్టు, విచారించడానికి ఎవరూ లేరంటూ సమాధానాలు వస్తున్నాయి. ఇదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో నెలకొన్న పరిస్థితి. టీనగర్కు చెందిన మహావీర్చంద్ ధోకా అనే వ్యక్తి చీటింగ్ జరిగిందంటూ సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లగా, కనీసం అతని సమస్యను పట్టించుకునే వారే లేదు. సిటీ పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లి అతను తన ఫిర్యాదు దాఖలు చేసుకున్నాడు.
అన్నా నగర్కు చెందిన 80 ఏళ్ల జయంతి హార్వేది ఇదే పరిస్థితి. ఇంట్లో దోపిడి జరిగిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లిన ఆమెకూ అన్నానగర్ పోలీసు స్టేషన్లో నిరాశే ఎదురైంది. అనుమానితుల పేర్లు, వివరాలు తన దగ్గర ఉన్నప్పటికీ కనీసం సీనియర్ పోలీసు ఆఫీసర్లను కలువలేకపోయాయని, వారందరూ అపోలో ఆస్పత్రిలో బిజీగా ఉన్నారని పేర్కొంది. ఇలా సిటీ పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులను సేకరించడానికి ఎవరూ ఆఫీసర్లు ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.
చాలామంది సీనియర్ ఆఫీసర్లు అపోలో ఆస్పత్రి దగ్గర డ్యూటీలో ఉన్నట్టు పేర్కొంటున్నారు. పోలీసు డిప్యూటీ ఆఫీసర్లందరూ ఆస్పత్రి ఆవరణలోని వాన్టేజ్ పాయింట్స్ వద్ద డ్యూటీలోఉండాలని ఆదేశాలు వెళ్లాయి. సెప్టెంబర్ 22న జయలలిత అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎయిమ్స్ ముగ్గురు సభ్యుల డాక్టర్ల బృందమే కాక, లండన్ వైద్య నిపుణులు ఆమెకు వైద్యసేవలందిస్తున్నారు. జయలలిత లేకుండా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలో మొదటి కేబినెట్ భేటీ నిన్న బుధవారమే జరిగింది. అమ్మ ఆస్పత్రి పాలవ్వడంతో, ప్రజలకు కనీస పోలీసు సేవలు అందడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement