
తమిళ గుండె చప్పుడు అమ్మ!
జయలలిత భారత రాజకీయాల్లోనే ఒక విలక్షణ నేత. తమిళనాడులో ఓ తిరుగులేని ఆకర్షణ మంత్రం. అమ్మ అంటే తమిళ ప్రజలకు సర్వస్వం. ఒక మహిళా నాయకురాలిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక నేరచరిత్ర కలిగిన వివాదాస్పద నేతగా ఎన్ని కోణాలు ఉన్నా.. జయలలిత అంటే తమిళ రాజకీయాల్లో ఒక మహాశిఖరం. ప్రజల కోసం ఎందాకైనా వెళ్లే స్వభావం, అమ్మ పథకాల్లోని ఆకర్షణ మంత్రం, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని స్థైర్యం, అనేకసార్లు పడిలేచిన కెరటం జయలలిత. ఆమె రాజకీయ జీవితాన్ని ఓసారి అవలోకిస్తే..
రాజకీయ ఆరంగేట్రం!
దక్షిణాది అగ్ర సినీ కథానాయికగా ఒక వెలుగువెలిగిన జయలలిత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఇప్పుడు ఆలిండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం- అన్నాడీఎంకే) పార్టీని స్థాపించిన అప్పటి ప్రముఖ తమిళ హీరో ఎంజీఆర్ అనతికాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆయన కనుసన్నల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయలలిత పార్టీ ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనతికాలంలోనే రాజకీయాల్లో జయలలిత సక్సెస్ అయ్యారు. ఆమె సభలకు విశేషంగా జనం వచ్చేవారు. ఈ నేపథ్యంలో ఓసారి ఆమెను పార్టీ పదవుల నుంచి ఎంజీఆర్ తొలగించారు. కానీ తన మరణానికి ముందు ఆయన ఆమె మళ్లీ పార్టీ ప్రచాక కార్యదర్శిగా నియమించారు.
ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఆయన వారసురాలిగా భార్య జానకి రామచంద్రన్ సీఎం పదవి చేపట్టారు. కానీ, తానే నిజమైన వారసురాలినంటూ అన్నాడీఎంకేను జయలలిత చీల్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జయలలిత పార్టీకి 23 సీట్లు రాగా.. జానకి వర్గానికి ఒక్క సీటే వచ్చింది. దీంతో జానకి రాజకీయాల్లోంచి తప్పుకోగా.. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు జయలలిత చేతికొచ్చాయి. ఆ తర్వాత నిరాఘాటంగా పార్టీపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన జయలలిత పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
1991లో తొలిసారిగా పగ్గాలు
రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జయలలిత తమిళనాడులో ఘనవిజయం సాధించారు. 234 సీట్లలో పోటీచేసిన అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి 225 స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 39 ఎంపీ స్థానాలూ గెలుపొందింది. తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన జయలలిత పలు జనాకర్షణ పథకాలు ప్రవేశపెట్టారు.
1996లో ఎదురుదెబ్బ!
1996 ఎన్నికల్లో జయలలితకు కోలుకోలేని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. 168 సీట్లలో పోటీచేసిన అన్నాడీఎంకే కేవలం నాలుగు స్థానాలు గెలుపొందింది. జయలలిత స్వయంగా బర్గూర్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ప్రజా వ్యతిరేకతకు తోడు అవినీతి ఆరోపణలు జయ సర్కార్‌ను దెబ్బతీశాయి. నిచ్చెలి శశికళ మేనల్లుడు, దత్తత కొడుకు సుధాకరన్ పెళ్లి కనీవినీ ఎరుగని ఖర్చుతో అత్యంత భారీగా నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ పెళ్లికి రూ. వందకోట్లు ఖర్చు అయినట్టు వినికిడి. ఈ పెళ్లి గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది. ఈ అవినీతి కేసులలో జయ, ఆమె నిచ్చెలి శశికళను కరుణానిధి ప్రభుత్వం అరెస్టు చేయించి కొంతకాలం జైలులో ఉంచింది కూడా.
2001లో మళ్లీ..
క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన జయలలిత 2001 ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం ఎదుర్కొన్నారు. అయినా ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే ఘనవిజయాన్ని సాధించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాన్సీ (టీఏఎన్‌సీఐ) ఆస్తుల ఆక్రమణ కేసును కొట్టివేయాలని ఎన్నికల సమయంలోనే జయ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆమెకు ఊరట లభించింది. ప్లెజంట్ స్టే హోటల్ కేసులోనూ ఆమె దోషిగా తేలింది. సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ రెండు కేసుల్లోనూ జయలలిత నిర్దోషిగా బయటపడింది. క్రిమినల్ కేసుల నుంచి బయటపడి.. సీఎం పదవి చేపట్టిన అనంతరం అందిపట్టి నియోజకవర్గం నుంచి మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి జయ ఘనవిజయం సాధించారు.
ముచ్చటగా మూడోసారి
2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో మూడోసారి తమిళనాడు సీఎంగా జయలలిత పగ్గాలు చేపట్టారు. 2011 డిసెంబర్ 9న జయ తన నిచ్చెలి శశికళను, మరో 13మందిని అన్నాడీఎంకేను నుంచి బహిష్కరించారు. ఆహారంలో విషం కలిపే తనను చంపేందుకు కుట్ర పన్నారనే అనుమానంతోనే వీరిపై అమ్మ వేటు వేసినట్టు కథనాలు వచ్చాయి. అనంతరం వీరి మధ్య విభేదాలు తొలిగిపోవడంతో శశికళను జయ తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.
అక్రమాస్తుల కేసు.. ఊడిన పదవి!
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించింది. జయ నిచ్చెలి శశికళ నటరాజన్, ఆమె మేనకోడలు ఇలవరిసి, జయ దత్తత కొడుకు సుధాకరన్‌ను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. ఈ తీర్పుతో జయలలిత సీఎం పదవికి అనర్హురాలయ్యారు. దేశంలో అనర్హతకు గురైన తొలి సీఎంగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. దీంతో జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2015 మే 11న కర్ణాటక హైకోర్టు అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా ప్రకటించింది. ఆమెపై ఉన్న అభియోగాలన్నింటినీ ఎత్తివేసింది. దీంతో ఆమె మళ్లీ సీఎం పదవికి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మే 23న ఆమె ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉప ఎన్నికల్లో ఉత్తర చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి 1.6 లక్షల బంపర్ మెజారిటీ గెలుపొందారు.
2016లో మరోసారి విజయదుందుభి
2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గత సంప్రదాయాలను తిరిగరాస్తూ.. వరుసగా రెండోసారి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఘనవిజయం సాధించింది. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండోసారి సీఎం అయిన నేతగా జయలలిత తమిళనాడులో చరిత్ర సృష్టించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసిన ఆమె ప్రతిపక్ష డీఎంకేను చిత్తుచేశారు.
‘అమ్మ’ జనాకర్షణ మంత్రం!
తమిళనాడులో ‘అమ్మ’కు తిరుగులేదు. ఆమె జనాకర్షణకు తిరుగులేదు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆమె ఎంతదాకైనా వెళ్తారు. ఎన్ని వరాలైనా ఇస్తారు. తమిళనాడు ప్రజలకు ‘అమ్మ’ ఇవ్వని వరమంటూ లేదు. ఆమె కురిపించని హామీ అంటూ ఎన్నికల్లో లేదంటే అతియోశక్తి కాదేమో. ‘అమ్మ’ క్యాంటీన్లు, అమ్మ గ్రైండర్లు, మిక్సీలు, అమ్మ మెడిసిన్, అమ్మ దవాఖానాలు, అమ్మ విత్తనాలు, అమ్మ ఫ్రీ వైఫై జోన్లు, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు... ఇలా సవాలక్ష అమ్మ పథకాలను ప్రజల కోసం జయలలిత ప్రవేశపెట్టి.. ప్రజల మెప్పు పొందారు.
తిరుగులేని ఏకఛత్రాధిపత్యం!
అన్నాడీఎంకేలో జయలలితది ఏకఛత్రాధిపత్యం. పార్టీలో 1,2,3 ఇలా అన్నీ స్థానాలు అమ్మవే. ఆమె కనుసన్నల్లోనే ఎంతటి నేతలైనా మసులుకోవాల్సిందే. అమ్మ కనిపిస్తే వంగి వంగి పాదాలకు దండాలు పెట్టాల్సిందే. పార్టీ సర్వస్వం అమ్మనే. జయలలిత వెళ్లిపోతే అన్నాడీఎంకే నాయకత్వ శూన్యం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.