జెఎస్‌పీఎల్ భారీ పెట్టుబడులు
రాంచి: జార్ఖండ్‌లో ప్రముఖ స్టీల్ సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్పిఎల్) భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రాష్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన జెఎస్‌పీఎల్ తన పెట్టుబడులును భారీగా పెంచనుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో రూ. 20వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే దాదాపు రూ.3వేల కోట్లను ఇన్వెస్ట్ చేసిన తాము మరిన్ని అదనపు పెట్టుబడులకు నిర్ణయించామని సంస్థ ఛైర్మన్ నవీన్ జిందాల్ ప్రకటించారు.
ఈ పెట్టుబడుల ద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్నిబాగా పెంచుతున్నట్టు తెలిపారు. తమ పత్రాటు స్టీల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా ప్రస్తుతం 1.6 మిలియన్ టన్నుల నుంచి 6 మిలియన్ టన్నుల కు పెంచుతున్నట్టు చెప్పారు. మూమెంటం జార్ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2017 నవీన్ ఈ విషయాన్ని ప్రకటించారు.
జార్ఖండ్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నా రాజకీయ అస్థిరత కారణంగా ఇబ్బందులుపడిందని చెప్పారు. కానీ రాష్త్ర్ట్రం ఇప్పుడు అభివృద్ధిమార్గంలో పయనిస్తోందన్నారు. మరోవైపు ఇదే సదస్సులో పాల్గొన్న టాటా గ్రూపు అధినేత రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సింది తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.