జియో సిమ్ల బ్లాక్ మార్కెట్కు తెరతీసిందెవరు?
జియో సిమ్ల బ్లాక్ మార్కెట్కు తెరతీసిందెవరు?
Published Fri, Oct 14 2016 8:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, ఉచిత డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సిమ్‌లను దక్కించుకునేందుకు వినియోగదారులు పడరాని పాట్లు పడుతుంటే, సర్వర్ ఫెయిల్యూర్ వంటి కుంటి సాకులతో జియో సిమ్లను కస్టమర్లకు అందిచడంలో రిలయన్స్ స్టోర్లు జాప్యం చేస్తున్నాయని వెల్లడవుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తెరతీశారని తెలుస్తోంది. ఒక్క సిమ్కు రూ.200 నుంచి రూ. 400ల వరకు చార్జ్ చేస్తున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల రిలయన్స్ స్టోర్స్లో జియో సిమ్లు కొనుక్కోవాలని అలుపు సొలుపు లేకుండా వేచిచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోందట. సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఖాళీ చేతులతో ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. ఓపిక నశించిన కస్టమర్లు సర్వరు ఎలా పనిచేయడం లేదో చూపించడంటూ రిలయన్స్ స్టోర్స్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే స్థానిక షాపులో మాత్రం రూ.300కు ఈ సిమ్లు లభ్యం మవుతుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇతర దుకాణాల వారు వెంటనే యాక్టివేట్ కూడా చేసి ఇస్తున్నారని తిలక్ నగర్కు చెందిన ఓ కస్టమర్ చెప్పారు. మరి సర్వర్లు పనిచేయనప్పుడు వారు ఎలా యాక్టివేట్ చేస్తున్నారని ప్రశ్నించిన ఆ కస్టమర్కు స్టోర్ ఆపరేటర్ చిర్రెత్తుకొచ్చే సమాధానం చెప్పారని తెలిసింది. అక్కడ దొరికితే మరి ఇక్కడేం చేస్తున్నారు, వెళ్లి కొనుక్కోడంటూ ఉచిత సలహా ఇచ్చాడని కస్టమర్ వాపోయారు. సాగర్పుర్, సదార్ బజార్ వంటి ప్రాంతాల్లో రిలయన్స్ డిజిటల్ ఎక్స్ప్రెస్ స్టోర్లలో ఇలాంటి పరిస్థితే నెలకొందని కస్టమర్లు వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటలకొద్దీ క్యూలో నిల్చున్న రిలయన్స్ స్టోర్ సర్వర్లు మాత్రం పనిచేయడం లేదని, తమకు సిమ్లు లభ్యం కావడం లేదంటున్నారు. రిలయన్స్ స్టోర్సే వారి స్వలాభాలకు స్థానిక టెలికాం షాపులకు రిలయన్స్ జియో సిమ్లను విక్రయిస్తున్నారని, ఇక్కడ సర్వర్లు పనిచేయడం లేదంటూ కుంటి సాకులు చెబుతున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక టెలికాం దుకాణాలు సైతం వారికి జియో సిమ్లు ఎక్కడ లభ్యమయ్యాయో మాత్రం వెల్లడించలేదంట. బిజినెస్ సీక్రెట్స్ బయటికి చెప్పకూడదని వారు చెబుతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్కు రిలయన్స్ స్టోర్లే తెరతీసాయంటూ కస్టమర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
Advertisement
Advertisement