Jio SIM
-
జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్ లేదు
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్‌స్పాట్‌కు చెందిన రూటర్, సిమ్‌లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్వర్క్ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్ వర్క్‌ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్స్పాట్లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్ లేని చోట ఇతర నెట్వర్క్ సిమ్‌లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది. సమయమూ వృథా.. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది. పాఠశాలల సమాచారం కూడా ఆన్లైన్లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ నెట్‌వర్క్‌కు చెందిన జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్‌స్పాట్ రూటర్‌ను, జియో నానో సిమ్‌లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. సిగ్నల్స్ ఉంటే ఉపయోగమే.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా, యానిమేషన్ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు. జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి. వైఫై సామగ్రిఅందచేసిన పాఠశాలలు ఇవే: కరకగూడెం – 02 కొత్తగూడెం –06 పినపాక –04 లక్ష్మీదేవిపల్లి –04 చర్ల –04 పాల్వంచ –10 దుమ్ముగూడెం –03 బూర్గంపాడు –07 అశ్వాపురం –04 భద్రాచలం –03 మణుగూరు –02 ములకలపల్లి –03 గుండాల –01 దమ్మపేట –07 ఆళ్లపల్లి –01 అశ్వారావుపేట –06 ఇల్లెందు –06 టేకులపల్లి –06 జూలూరుపాడు –04 చండ్రుగొండ –03 అన్నపురెడ్డిపల్లి –02 చుంచుపల్లి –04 సుజాతనగర్ –03 -
జియో సిమ్‌కు పూజలు
భట్టిప్రోలు: రిలయన్స్ జియో సిమ్ ఆఫర్ గడువు నేటితో ముగియనుండటంతో వినియోగదారులు ఆఫర్ గడువును పొడిగించాలని కోరుతూ జియో సిమ్‌కు పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన జియో సిమ్ సేవలు వినియోగదారులు ఉచితంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వ దినాన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన వినియోగదారుడు మాచర్ల వీరేంద్ర జియో సిమ్‌కు పండ్లు, పూలు పెట్టి పూజలు నిర్వహించాడు. -
జియోకు లభించే ఆదరణ ఏ రేంజ్ లో ఉందంటే...
న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో ఇన్ని రోజులు వినియోగదారులను మైమరిపించిన రిలయన్స్ జియో ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. 2017 ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే ఛార్జీల వసూల తర్వాత నుంచి చాలామంది జియో సిమ్ సబ్‌స్క్రైబింగ్ ను ఆపివేస్తారంటూ పలు రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదెంత నిజమో తెలుసుకోవడం కోసం బ్రోకరేజ్ సంస్థ బెర్న్ స్టెయిన్ ఓ రీసెర్చ్ నిర్వహించింది. ఈ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైంది. కస్టమర్ మన్ననలను పొందడంలో రిలయన్స్ జియో అత్యధిక స్కోర్ నమోదుచేసిందని, ఇంక్యుబెంట్లను మించి కస్టమర్ సర్వీసు, అనుకూలత, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ లో ఇది మంచి పేరును సంపాదించుకుంటుందని వెల్లడైంది. జియో ఉచిత ఆఫర్లను చాలామంది మెచ్చుకుంటారని కానీ వాయిస్ క్వాలిటీ, ఛార్జీల బాదుడు విషయంతో చాలామంది తమ ప్రైమరీ ఆపరేటర్ కు వెళ్తారని చెప్తారేమో అనుకున్నామని బెర్న్ స్టెయిన్ తెలిపింది. కానీ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైనట్టు పేర్కొంది. వాయిస్ క్వాలిటీ, వాయిస్ కవరేజ్ లో వొడాఫోన్, ఐడియాలను మించి జియో మంచి ప్రదర్శనను కనబర్చిందని రీసెర్చ్ వెల్లడించింది. నెలకు రూ.303 ఛార్జీ వసూల చేయడం ప్రారంభించిన తర్వాత కూడా 67 శాతం మంది యూజర్లు తాము కలిగిన ఉన్న జియో సెకండరీ సిమ్ ను అలాగే వాడుతామని పేర్కొన్నారు. వారిలో 63శాతం మంది కొత్త ప్రైమరీ ఆపరేటర్ గా తమ జియోను మార్చుకోవాలనేది ప్లాన్ అని చెప్పారు. మిగతా 28 శాతం మంది సెకండ్ సిమ్ గానే జియోను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం మంది జియో యూజర్లు మాత్రమే తమ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అది కూడా జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తే వాటిని వాడతామని చెప్పారు. జియో ఛార్జీల వసూల బాదుడు తర్వాత ఎంత మంది ఆ సిమ్ ను వాడతారనే దానిపైనే ఈ రీసెర్చ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ రీసెర్చ్ లో కూడా ఉచిత ఆఫర్లను ఇవ్వకపోయినా కస్టమర్ల మన్ననలను జియోకు అలాగే ఉంటాయని వెల్లడైంది. మొత్తం వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ ఈ రీసెర్చ్ ను చేపట్టింది. రీసెర్చ్ లో పాల్గొన్న వారిలో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన వారు కాగ, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు. -
జియో సిమ్ల బ్లాక్ మార్కెట్‌కు తెరతీసిందెవరు?
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, ఉచిత డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సిమ్‌లను దక్కించుకునేందుకు వినియోగదారులు పడరాని పాట్లు పడుతుంటే, సర్వర్ ఫెయిల్యూర్ వంటి కుంటి సాకులతో జియో సిమ్‌లను కస్టమర్లకు అందిచడంలో రిలయన్స్ స్టోర్లు జాప్యం చేస్తున్నాయని వెల్లడవుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారని తెలుస్తోంది. ఒక్క సిమ్‌కు రూ.200 నుంచి రూ. 400ల వరకు చార్జ్ చేస్తున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల రిలయన్స్ స్టోర్స్‌లో జియో సిమ్‌లు కొనుక్కోవాలని అలుపు సొలుపు లేకుండా వేచిచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోందట. సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఖాళీ చేతులతో ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. ఓపిక నశించిన కస్టమర్లు సర్వరు ఎలా పనిచేయడం లేదో చూపించడంటూ రిలయన్స్ స్టోర్స్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే స్థానిక షాపులో మాత్రం రూ.300కు ఈ సిమ్‌లు లభ్యం మవుతుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇతర దుకాణాల వారు వెంటనే యాక్టివేట్ కూడా చేసి ఇస్తున్నారని తిలక్ నగర్‌కు చెందిన ఓ కస్టమర్ చెప్పారు. మరి సర్వర్లు పనిచేయనప్పుడు వారు ఎలా యాక్టివేట్ చేస్తున్నారని ప్రశ్నించిన ఆ కస్టమర్‌కు స్టోర్ ఆపరేటర్ చిర్రెత్తుకొచ్చే సమాధానం చెప్పారని తెలిసింది. అక్కడ దొరికితే మరి ఇక్కడేం చేస్తున్నారు, వెళ్లి కొనుక్కోడంటూ ఉచిత సలహా ఇచ్చాడని కస్టమర్ వాపోయారు. సాగర్‌పుర్, సదార్ బజార్ వంటి ప్రాంతాల్లో రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్లలో ఇలాంటి పరిస్థితే నెలకొందని కస్టమర్లు వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటలకొద్దీ క్యూలో నిల్చున్న రిలయన్స్ స్టోర్ సర్వర్లు మాత్రం పనిచేయడం లేదని, తమకు సిమ్‌లు లభ్యం కావడం లేదంటున్నారు. రిలయన్స్ స్టోర్సే వారి స్వలాభాలకు స్థానిక టెలికాం షాపులకు రిలయన్స్ జియో సిమ్‌లను విక్రయిస్తున్నారని, ఇక్కడ సర్వర్లు పనిచేయడం లేదంటూ కుంటి సాకులు చెబుతున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక టెలికాం దుకాణాలు సైతం వారికి జియో సిమ్‌లు ఎక్కడ లభ్యమయ్యాయో మాత్రం వెల్లడించలేదంట. బిజినెస్ సీక్రెట్స్ బయటికి చెప్పకూడదని వారు చెబుతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్‌కు రిలయన్స్ స్టోర్లే తెరతీసాయంటూ కస్టమర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.