జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్‌ లేదు | No Signal to SIM Cards | Sakshi
Sakshi News home page

జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్‌ లేదు

Published Tue, Jan 2 2018 10:26 AM | Last Updated on Tue, Jan 2 2018 10:27 AM

No Signal to  SIM Cards  - Sakshi

కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్‌ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్‌స్పాట్‌కు చెందిన రూటర్, సిమ్‌లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్‌వర్క్‌ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్‌ వర్క్‌ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్‌స్పాట్‌లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్‌ లేని చోట ఇతర నెట్‌వర్క్‌ సిమ్‌లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది.

సమయమూ వృథా.. 
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్‌ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్‌ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది.  పాఠశాలల సమాచారం కూడా ఆన్‌లైన్‌లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్‌ నెట్‌వర్క్‌కు చెందిన  జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్‌స్పాట్‌ రూటర్‌ను, జియో నానో సిమ్‌లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానం చేసి ఇంటర్‌నెట్‌ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్‌ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. 

సిగ్నల్స్‌ ఉంటే ఉపయోగమే..  
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్‌ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్‌ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్‌ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా, యానిమేషన్‌ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు.  జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి.  

వైఫై సామగ్రిఅందచేసిన 
పాఠశాలలు ఇవే: 

కరకగూడెం    – 02
కొత్తగూడెం    –06
పినపాక    –04
లక్ష్మీదేవిపల్లి    –04
చర్ల    –04
పాల్వంచ    –10
దుమ్ముగూడెం    –03
బూర్గంపాడు    –07 
అశ్వాపురం    –04
భద్రాచలం    –03 
మణుగూరు    –02
ములకలపల్లి    –03 
గుండాల    –01
దమ్మపేట    –07 
ఆళ్లపల్లి    –01
అశ్వారావుపేట     –06 
ఇల్లెందు    –06
టేకులపల్లి    –06 
జూలూరుపాడు    –04 
చండ్రుగొండ    –03 
అన్నపురెడ్డిపల్లి    –02 
చుంచుపల్లి    –04 
సుజాతనగర్‌     –03 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement