'ఆరెస్సెస్, అమిత్ షా వల్లే ఓడాం'
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దారుణ పరాభవానికి కారణం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానేనని మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జీతన్‌రామ్ మాంఝీ నిందించారు. 'దళితులు, ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాపై సమీక్ష జరుపాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఎన్డీయే విజయావకాశాలను దెబ్బతీశాయి. ఆయన వ్యాఖ్యలను ప్రధానాంశంగా చేసుకొని మహాకూటమి ప్రచారం జరిపింది' అని మాంఝీ పేర్కొన్నారు.
అదేవిధంగా బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్‌లో టపాసులు పేలుతాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, ఈ వ్యాఖ్యలు మహాకూటమికే లబ్ధి చేకూర్చాయని ఆయన చెప్పారు. ఎన్డీయే కూటమిలో భాగంగా 20 స్థానాల్లో పోటీచేసిన హెచ్ఏఎం కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది.