హెచ్-1బీ వీసా ఎఫెక్ట్: ఇన్ఫీ కీలక నిర్ణయం
హెచ్-1బీ వీసా ఎఫెక్ట్: ఇన్ఫీ కీలక నిర్ణయం
Published Mon, Mar 20 2017 8:45 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
బెంగళూరు : హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికా తీసుకుంటున్న చర్యలతో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ ఎంప్లాయిస్ కి హెచ్-1బీ వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వర్క్ వీసాలో వస్తున్న కఠినతరమైన నిబంధనలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయి. కానీ కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసాల్లో మార్పులకు ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో కంపెనీ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు వర్క్ వీసాలు అప్లయ్ చేయకూడదని ఇన్ఫోసిస్ నిర్ణయించింది.
ఇతర దేశాలకు వ్యాపారాలను తరలించే ప్రక్రియపై క్లయింట్లతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఇండియాలోనే ఎక్కువ పని ఉండేలా.. జూనియర్ ఎంప్లాయిస్ ను భారత్ కే ఎక్కువగా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. సిస్టమ్స్ ఇంజనీర్స్, సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కు ఇన్ఫోసిస్ వీసా అభ్యర్థనలను పంపలేదని మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్స్ కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న దానికి రెండింతలు చేస్తూ అంతకముందే అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ వేతనాల పెంపు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే జూనియర్లకు వీసాలు అప్లయ్ చేయకపోయే విషయంపై కంపెనీ స్పందించడానికి నిరాకరించింది. జూనియర్ ఎంప్లాయిస్ కి వీసా దరఖాస్తు చేయకపోవడం కంపెనీలో మరో సమస్య నెలకొంటుందని ఇన్ఫోసిస్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement