పామే కాదు.. బిల్లూ కాటేసింది..
వాషింగ్టన్: పాము కాటునైనా భరించగలిగాను కాని.. ఆస్పత్రి వారిచ్చిన బిల్లు భారాన్ని మాత్రం భరించలేకపోయాను బాబోయ్ అంటోంది చిత్రంలోని జూలెస్ వీజ్. విషయమేమిటంటే.. అమెరికాకు చెందిన ఈమె గత నెల్లో తన కారులో వెళ్తూవెళ్తూ.. వర్జీనియాలోని పొటోమాక్ నది వద్ద అందమైన దృశ్యాన్ని చూసి.. క్యా సీన్ హై అంటూ కారు ఆపి దిగింది. అలా చూస్తుండగానే.. ఇలా ఓ పాము వచ్చేసి కాటేసి పోయింది. ఏదో కందిరీగ కుట్టిందిలే అనుకుని.. కారు స్టార్ట్ చేసి లైట్ల వెలుతురులో చూస్తే.. పాము కాటులాగా రెండు గాట్లు కనిపించాయి. గంటలో కాలు బెలూన్‌లాగా ఉబ్బిపోయింది.
ఈమె వెంటనే బెటెస్డాలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పాముకాటుకు విరుగుడు మందును ఓ మూడు డోసులు ఇచ్చారు. 18 గంటలు ఆస్పత్రిలో ఉంది. హమ్మయ్య.. బతికి బట్టకట్టానురా అనుకునేసరికి.. ముందు బిల్లు కట్టు అంటూ రూ.34 లక్షల ఆస్పత్రి బిల్లు చేతిలో పెట్టారు. దీనికితోడు వీజ్ వైద్య బీమా అంతకు కొన్నిరోజుల ముందే ముగిసిపోయిందట! దీంతో నానాపాట్లు పడి ఆమె బిల్లు కట్టింది. ఆస్పత్రి తీరును మీడియా ముందు ఎండట్టింది. పాముకాటు విరుగుడు మందు రేటు చాలా పెరిగిపోయిందంటూ ఆస్పత్రి సమర్థించుకుంది.