ఆ డైరెక్టర్ పిల్లలను చూసేందుకు నటి నో!
ఒకప్పుడు దర్శకుడు కరణ్ జోహర్, నటి కాజోల్ మంచి స్నేహితులు. కానీ, చాలా రంగాల్లో మాదిరిగానే బాలీవుడ్‌లోనూ స్నేహం కూడా తాత్కాలికమే. కరణ్, కాజోల్ ఇప్పుడు స్నేహితులు కాదు. కనీసం ఎదురెదురుపడితే ముఖం తిప్పుకొనిపోయే బద్ధవైరం కూడా వారి మధ్యలో ఉంది. ఇటీవలే కరణ్ జోహర్ సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చాడు. మరీ ఆ శిశువులను చూసేందుకు మీరు వెళుతారా? అంటే కాజోల్ ఏమన్నదో తెలుసా..
ఈ మధ్య విడుదలైన తన ఆత్మకథ 'అన్‌సూటబుల్ బోయ్'లో కరణ్ కాజోల్ గురించి రాస్తూ.. 'ఏది ఏమైనా ఆమె నా జీవితంలోంచి వెళ్లిపోయింది' అంటూ పరుషంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఓ అవార్డుల వేడుకలో కరణ్, కాజోల్-అజయ్ దేవ్‌గన్ దంపతులు ఎదురుపడ్డా.. కనీసం పలుకరించుకోకుండా ముఖాలు తిప్పుకొని వెళ్లిపోయారు.
ఇక గత ఏడాది ఒకే సమయంలో కరణ్ యే దిల్ హై ముష్కిల్, అజయ్ దేవ్‌గణ్ 'శివాయ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటంతో.. బాహాటంగానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో కరణ్-కాజోల్ మధ్య స్నేహసంబంధాలు ఎడమొఖం పెడమొఖంలా మారిపోయాయి. ఇటీవలే ఆస్పత్రి నుంచి ఇంటికి తెచుకున్న కరణ్ కవలలను చూసేందుకు బాలీవుడ్ జనాలు ఆయన ఇంటికి పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజోల్‌ను మీరు కూడా కరణ్ కవల పిల్లలను చూసేందుకు వెళుతారా? అని ప్రశ్నించగా.. 'ఆ విషయం అడగకండి. అలాంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను' అంటూ కాజోల్ సూటిగా చెప్పేసిందట. మొత్తంమీద వీరి మధ్య స్నేహం దారుణంగా చెడిపోయిందని సినీ జనాలు అంటున్నారు.