![లోక నాయకుడి సంచలన వ్యాఖ్యలు](/styles/webp/s3/article_images/2017/09/17/41504164930_625x300.jpg.webp?itok=sTuyAyHh)
లోక నాయకుడి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో రోజుకో ఎపిసోడ్ రాజకీయ ప్రకంపలను రేపుతూనే ఉంది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభం రగులుతుండగా.. తాజాగా సినీ లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
తమిళనాడులో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, ఈ అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కమల్ తాజాగా పేర్కొన్నారు. అవినీతి కోటను ముట్టడించాలంటూ తన అభిమానులకు ఆయన పిలుపునివ్వడం గమనార్హం. ఈ పోరాటంలో తాను ముందుంటానని, ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఇప్పటికే రాజకీయ వ్యాఖ్యలతో కమల్ హాసన్ తమిళనాట గగ్గోలురేపుతున్న సంగతి తెలిసిందే. గతంలో అధికార అన్నాడీఎంకేపై విరుచుకుపడిన ఆయన ఇప్పుడు అన్నాడీఎంకేతోపాటు, ప్రతిపక్ష డీఎంకేపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు మరో సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే కమల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.