రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఎస్1 బోగీని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో వెంకటేష్ నాయక్ మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి.
బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రిస్కూం సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ, బెంగళూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న గ్రానైట్ లారీ నంబరు AP 16 TT 9885, 2003 లో రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు.