- షూటింగ్లో భాగంగా హెలికాప్టర్లో నుంచి రిజర్వాయర్‌లోకి దూకే సీన్ కోసం ఎలాంటి ముందుజాగ్రత్త భద్రత చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. హీరో దునియా విజయ్, విలన్ పాత్రలు పోషిస్తున్న ఉదయ్, అనిల్ ముగ్గురు నీటిలో దూకగా.. ఒక్క విజయ్ కోసమే భద్రత ఏర్పాట్లు చేశారని సమాచారం.
-
రిజర్వాయర్ మీద హెలికాప్టర్ తో చక్కర్లు కొట్టేందుకు మాత్రమే బెంగళూరు వాటర్ బోర్డు చిత్రయూనిట్‌కు అనుమతి ఇచ్చింది. రిజర్వాయర్‌లో షూటింగ్‌కు కానీ, రిజర్వాయర్‌లో దూకే స్టంట్లకుకానీ వాటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు.
-
ముందుజాగ్రత్త చర్యగా ఒక డీజిల్ బోటును అందుబాటులో ఉంచినా.. అది ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల పనిచేయలేదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక తెప్ప మాత్రమే అందుబాటులో ఉంది. అది రిజర్వాయర్‌లో దూకిన హీరో విజయ్ను కాపాడటానికి ఉపయోగపడింది.
-
ఇంకా దారుణం ఏమిటంటే తమకు ఈత సరిగ్గా రాదని, నిపుణుల వద్ద తమకు ఈతలో శిక్షణ కూడా ఇప్పించలేదని నటులు ఉదయ్, అనిల్ షూటింగ్‌కు ముందు టీవీచానెళ్లతో చెప్పారు. అయినా, వారి భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది.
-
హెలికాప్టర్లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్‌పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ మీడియాకు తెలిపారు. ఈ సీన్ చిత్రీకరణను కవర్ చేసేందుకు న్యూస్‌చానెళ్లను కూడా ఆహ్వానించారు.
-
షూటింగ్‌కు ముందు న్యూస్ చానెళ్లతో ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి స్టంట్‌ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఇంత ఎత్తు నుంచి ఎప్పుడూ దూకలేదు. మేం ముగ్గురం ఒకరిని ఒకరు చూస్తూ హెలికాప్టర్ నుంచి దూకుతాం. ఆపై దేవుడి దయ. ఏదైనా జరగరానిది జరిగితే ఆయన సంకల్పం అనుకుంటాం’ అని పేర్కొన్నాడు. అనిల్ మాట్లాడుతూ ‘అంత ఎత్తు నుంచి దూకడం ఇదే తొలిసారి. మాకు కొంచెం భయంగా ఉంది. నాకు కొంచెం ఈత వచ్చు. ఊర్లలో బావిలో దూకినట్టు దూకేస్తా’ అని చెప్పాడు.
- ప్రమాదం జరిగాక సంఘటనాస్థలంలో అంబులెన్సులు, సహాయక సిబ్బంది వంటి అత్యవసర సేవలు ఏమాత్రం అందుబాటులో లేవు. ఏమాత్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇంత ప్రమాదకరమైన షాట్ చిత్రీకరణకు పూనుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పరారీలో ఉన్న చిత్ర నిర్మాతతోపాటు దర్శకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు.