Maasthigudi
-
మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ
దొడ్డబళ్లాపురం : 2016లో కన్నడ సినీ హీరో దునియా విజయ్ నటించిన మాస్తిగుడి సినిమా షూటింగ్ మాగడి సమీపంలోని తిప్పగొండనహళ్లి డ్యాంలో చేస్తుండగా అనిల్, ఉదయ్ అనే ఇద్దరు ఫైటర్లు నీటమునిగి మృతి చెందిన కేసు నుండి తమ పేర్లను తొలగించాలని ఐదుగురు నిందితులు పెట్టుకున్న అర్జీలను రామనగర జిల్లా కోర్టు కొట్టివేసింది. 2016లో నవంబర్.7న మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా హెలికాప్టర్ నుండి డ్యాంలోకి పడ్డ ఇద్దరు విలన్ పాత్రధారులు ఉదయ్, అనిల్ నీట మునిగి మృతి చెందారు. ఇదే సమయంలో వారితోపాటు డ్యాంలో పడ్డ హీరో విజయ్ను అక్కడున్నవారు రక్షించారు. ఘటనకు సంబంధించి తావరెకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ నడుపుతున్న ప్రకాశ్ బిరాదార్ పేరును కోర్టు తొలగించింది. బిరాదార్ తరఫు లాయర్ దిలీప్ ఈ ఘటనలో బిరాదార్ తప్పు ఏమాత్రం లేదని అతడి పేరు కేసు నుండి తొలగించాలని వాదించారు. దిలీప్ వాదనలతో ఏకీభవించి కోర్టు బిరాదార్ పేరు తొలగించింది. చిత్రం నిర్మాత సుందర్ పి.గౌడ, డైరెక్టర్ రాజశేఖర్,సిద్ధార్థ్ ఆలియాస్ సిద్ధు, స్టంట్స్ డైరెక్టర్లయిన రవివర్మ, భరత్రావ్లు ఐదుగురు తమను కూడా కేసు నుండి విముక్తులను చేయాలని అర్జీ పెట్టుకున్నప్పటికీ రామనగర జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం సాయంత్రం వాటిని కొట్టివేసింది. -
గల్లంతైన మరో నటుడి మృతదేహం లభ్యం
హైదరాబాద్: ‘మాస్తిగుడి’ సినిమా క్లైయిమాక్స్ చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో సోమవారం గల్లంతైన ఇద్దరు కన్నడ నటుల్లో మరొక నటుడి మృతదేహం లభించింది. నటుడు అనిల్ మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. గజ ఈతగాళ్లు, స్థానికులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యల చేపట్టగా.. మంగళవారం ఉదయం ఉదయ్ రాఘవ మృతదేహం లభించింది. కాగా అనిల్ ఆచూకీ లభించకపోవడంతో తీవ్రంగా గాలించిన సిబ్బంది ఈ రోజు ఉదయం అనిల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. -
షూటింగ్ విషాదం... షాకింగ్ నిజాలు!
కన్నడ సినిమా షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు నటుల మృతదేహాలు ఇంకా లభించలేదు. 30మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రిజర్వాయర్‌లో తీవ్రంగా గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ప్రముఖ హీరో ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం ఈ సినిమా పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే... షూటింగ్లో భాగంగా హెలికాప్టర్లో నుంచి రిజర్వాయర్‌లోకి దూకే సీన్ కోసం ఎలాంటి ముందుజాగ్రత్త భద్రత చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. హీరో దునియా విజయ్, విలన్ పాత్రలు పోషిస్తున్న ఉదయ్, అనిల్ ముగ్గురు నీటిలో దూకగా.. ఒక్క విజయ్ కోసమే భద్రత ఏర్పాట్లు చేశారని సమాచారం. రిజర్వాయర్ మీద హెలికాప్టర్ తో చక్కర్లు కొట్టేందుకు మాత్రమే బెంగళూరు వాటర్ బోర్డు చిత్రయూనిట్‌కు అనుమతి ఇచ్చింది. రిజర్వాయర్‌లో షూటింగ్‌కు కానీ, రిజర్వాయర్‌లో దూకే స్టంట్లకుకానీ వాటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఒక డీజిల్ బోటును అందుబాటులో ఉంచినా.. అది ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల పనిచేయలేదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక తెప్ప మాత్రమే అందుబాటులో ఉంది. అది రిజర్వాయర్‌లో దూకిన హీరో విజయ్ను కాపాడటానికి ఉపయోగపడింది. ఇంకా దారుణం ఏమిటంటే తమకు ఈత సరిగ్గా రాదని, నిపుణుల వద్ద తమకు ఈతలో శిక్షణ కూడా ఇప్పించలేదని నటులు ఉదయ్, అనిల్ షూటింగ్‌కు ముందు టీవీచానెళ్లతో చెప్పారు. అయినా, వారి భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. హెలికాప్టర్లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్‌పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ మీడియాకు తెలిపారు. ఈ సీన్ చిత్రీకరణను కవర్ చేసేందుకు న్యూస్‌చానెళ్లను కూడా ఆహ్వానించారు. షూటింగ్‌కు ముందు న్యూస్ చానెళ్లతో ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి స్టంట్‌ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఇంత ఎత్తు నుంచి ఎప్పుడూ దూకలేదు. మేం ముగ్గురం ఒకరిని ఒకరు చూస్తూ హెలికాప్టర్ నుంచి దూకుతాం. ఆపై దేవుడి దయ. ఏదైనా జరగరానిది జరిగితే ఆయన సంకల్పం అనుకుంటాం’ అని పేర్కొన్నాడు. అనిల్ మాట్లాడుతూ ‘అంత ఎత్తు నుంచి దూకడం ఇదే తొలిసారి. మాకు కొంచెం భయంగా ఉంది. నాకు కొంచెం ఈత వచ్చు. ఊర్లలో బావిలో దూకినట్టు దూకేస్తా’ అని చెప్పాడు. ప్రమాదం జరిగాక సంఘటనాస్థలంలో అంబులెన్సులు, సహాయక సిబ్బంది వంటి అత్యవసర సేవలు ఏమాత్రం అందుబాటులో లేవు. ఏమాత్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇంత ప్రమాదకరమైన షాట్ చిత్రీకరణకు పూనుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పరారీలో ఉన్న చిత్ర నిర్మాతతోపాటు దర్శకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. -
నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు
బెంగళూరు: కన్నడ సినిమా 'మాస్తీగుడి' షూటింగ్ సమయంలో ఇద్దరు వర్ధమాన నటులు రిజర్వాయర్‌లో మునిగి చనిపోయిన ఘటనకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్టంట్ డైరెక్టర్, యూనిట్ మేనేజర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, చిత్ర నిర్మాత, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్ నిర్లక్ష్యం కారణంగా వారు ప్రాణాలుకోల్పోయారని ప్రాథమిక విచారణ నివేదికలో పోలీసులు నమోదు చేసుకున్నారు. దునియా విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకగా.. ఆ సమయానికి రక్షణ బోట్లు రాకపోవడం, వీరికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
⇒ హెలికాప్టరు నుంచి రిజర్వాయర్‌లోకి దూకిన హీరో, విలన్లు ⇒ ఈత రాకపోవడంతో ఇద్దరు నటుల గల్లంతు ⇒ హీరో దునియా విజయ్ క్షేమం సాక్షి, బెంగళూరు: కన్నడ సినిమా చిత్రీకరణ సమయంలో విషాదం చోటుచేసుకుంది. చిత్రం పతాక సన్నివేశాలను ఒక రిజర్వాయర్ సమీపంలో చిత్రీకరిస్తుండగా ఇద్దరు వర్ధమాన నటులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడం, రక్షక బోట్లు సరైన సమయానికి రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. హీరో విజయ్ కూడా వారి వెనకే దూకినా అతనికి తెప్ప అందడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన పూడిక కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, సినిమా చిత్రీకరణ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత ప్రమాదకరమైన చిత్రీకరణకు ముందు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనతో కన్నడ సినీవర్గాలు విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన అనిల్, ఉదయ్ కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు ఈత సరిగా రాదని, స్టంట్లు చేయడం భయమని పేర్కొనడం గమనార్హం. -
విషాదం: అతను తెలుగు చిత్రాలు చేశాడు!
ఓ కన్నడ సినిమా షూటింగ్ స్టంట్‌లో పాల్గొంటూ ప్రాణాలు విడిచిన నటుడు రాఘవ ఉదయ్ పలు తెలుగు సినిమాల్లోనూ కనిపించాడు. జక్కన్న, బుల్లెట్ రాణి వంటి తెలుగు సినిమాలతోపాటు త్వరలో కామెడియన్ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'లోనూ అతను నటించినట్టు తెలుస్తోంది. పలు కన్నడ సినిమాల్లో విలన్‌గా నటించి పలు అవార్డులు సైతం గెలుపొందిన ఉదయ్ ఇటీవలే తనకు ఎత్తులంటే భయమని చెప్పాడు. "ఇలాంటి స్టంట్‌ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తిచేస్తానని ఆశిస్తున్నా' అంటూ సువర్ణ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ చెప్పాడు. కన్నడ హీరో దునియ విజయ్ నటిస్తున్న చిత్రం 'మాస్తీగుడి' క్లైమాక్స్ షూటింగ్లో భాగంగా సోమవారం తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌లో జరిగిన విషాదంలో ఉదయ్‌తోపాటు మరో నటుడు అనిల్ గల్లంతైన సంగతి తెలిసిందే. వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్లైమాక్స్ షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ నుంచి హీరో దునియ విజయ్‌తోపాటు ఉదయ్, అనిల్ రిజర్వాయర్‌లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్‌లో మునిగిపోయారు. నిజానికి హెలికాప్టర్లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్‌పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ గతంలో మీడియాకు తెలిపారు. దీంతో క్లైమాక్స్ చిత్రీకరణకు ముందు ఇందులో పాల్గొనే నటులతో న్యూస్చానెళ్లు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ఉదయ్ ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లడం అతని అభిమానులను దిగ్భ్రాంత పరుస్తున్నది. -
క్లైమాక్స్ షూటింగ్లో పెనువిషాదం..!
అది భారీ రిజర్వాయర్. ప్రముఖ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అక్కడ జరుగుతోంది. హెలికాప్టర్ షాట్‌ను చిత్రీకరిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి హీరోతోపాటు ఇద్దరు విలన్లు దూకారు. దూకడం వరకు దర్శకుడు ప్లాన్ చేసుకున్నట్టే జరిగింది. కానీ, హెలికాప్టర్ నుంచి దూకిన తర్వాతే పెనువిషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ నుంచి దూకిన ఇద్దరు నటులు చెరువులో ఈదుతూ.. గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద హీరో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెప్పపాటులో కళ్లముందే కెమెరాలు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర దిగ్బ్రాంతికర ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రముఖ కన్నడ హీరో దునియ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "మాస్తీగుడి' . బెంగళూరుకి 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్‌లో సోమవారం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ నుంచి హీరోతోపాటు ఇద్దరు నటులు ఉదయ్, అనిల్ రిజర్వాయర్‌లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్‌లో మునిగి చనిపోయారు. ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంత పరిచింది. మరోవైపు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇంత రిస్కీ షాట్ చిత్రీకరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమదం నేపథ్యంలో చిత్రయూనిట్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు నటులు.......................................................ప్రమాదం నుంచి బయటపడ్డ హీరో దునియ విజయ్