విషాదం: అతను తెలుగు చిత్రాలు చేశాడు!
విషాదం: అతను తెలుగు చిత్రాలు చేశాడు!
Published Mon, Nov 7 2016 7:51 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఓ కన్నడ సినిమా షూటింగ్ స్టంట్‌లో పాల్గొంటూ ప్రాణాలు విడిచిన నటుడు రాఘవ ఉదయ్ పలు తెలుగు సినిమాల్లోనూ కనిపించాడు. జక్కన్న, బుల్లెట్ రాణి వంటి తెలుగు సినిమాలతోపాటు త్వరలో కామెడియన్ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'లోనూ అతను నటించినట్టు తెలుస్తోంది.
పలు కన్నడ సినిమాల్లో విలన్‌గా నటించి పలు అవార్డులు సైతం గెలుపొందిన ఉదయ్ ఇటీవలే తనకు ఎత్తులంటే భయమని చెప్పాడు. "ఇలాంటి స్టంట్‌ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తిచేస్తానని ఆశిస్తున్నా' అంటూ సువర్ణ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ చెప్పాడు.
కన్నడ హీరో దునియ విజయ్ నటిస్తున్న చిత్రం 'మాస్తీగుడి' క్లైమాక్స్ షూటింగ్‌లో భాగంగా సోమవారం తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌లో జరిగిన విషాదంలో ఉదయ్‌తోపాటు మరో నటుడు అనిల్ గల్లంతైన సంగతి తెలిసిందే. వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్లైమాక్స్ షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్ నుంచి హీరో దునియ విజయ్‌తోపాటు ఉదయ్, అనిల్ రిజర్వాయర్‌లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్‌లో మునిగిపోయారు.
నిజానికి హెలికాప్టర్‌లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్‌పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ గతంలో మీడియాకు తెలిపారు. దీంతో క్లైమాక్స్ చిత్రీకరణకు ముందు ఇందులో పాల్గొనే నటులతో న్యూస్‌చానెళ్లు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ఉదయ్ ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లడం అతని అభిమానులను దిగ్భ్రాంత పరుస్తున్నది.
Advertisement
Advertisement