
కాన్పూర్ ట్రాజెడీ నుంచి తప్పించుకున్న జర్నలిస్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో పెను విషాదాన్ని సృష్టించిన కాన్పూర్ రైలు ప్రమాదంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. పెళ్లి కావల్సిన యువడితో సహా వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంనుంచి ఓజర్నలిస్టు తృటిలో తప్పించుకున్నారు. సీటును మార్చుకోవడంతో తాను మృత్యువు నుంచి తప్పించుకున్నానని జర్నలిస్టు సంతోష ఉపాద్యాయ్ చెప్పారు. లేదంటే అదే తనకు చివరి రోజు అయి వుండేదంటూ తన భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అత్యవసర కిటికీ నుంచి బయటికి వచ్చి చూస్తే చుట్టూ మృతదేహాలు, ప్రయాణీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా భయకరంగా ఉందన్నారు.అయితే భౌతిక గాయాలు నయంకావచ్చు, కానీ తను కళ్లారా చూసిన భయానకమైన విషాదాన్ని మర్చిపోలేక పోతున్నానని ఆయన వాపోయారు. మీందరూ టీవీలలో చూశారు.. కానీ తాను ప్రత్యక్షంగా ఆ ఘోర ప్రమాదాన్ని చూశాననీ, తన కళ్లముందే బోగీలు అలా కుప్పకూలాయంటూ గుర్తు చేసుకున్నారు.
ఉజ్జయినిలో ఇండోర్ -పాట్నా రైలెక్కిన సంతోష్ ది ఎస్ 2 లోని బెర్త్ నెం.7 . అయితే తన ప్రెండ్ దగ్గర కూర్చోవడానికి వీలుగా మహిళా ప్రయాణికురాలు ఎస్ 5 కోచ్ కి వెళ్లాల్సిందిగా కో్రడంతో సంతోష్ అక్కడికి తన బెర్త్ ను మార్చుకున్నాడు. ఫోన్లో మేసేజ్ లు చెక్ చేసుకుంటుండగా భారీ శబ్దం వినిపించింది. దీంతో ప్రమాదాన్ని ఊహించిన సంతోష్ ఎమర్జెన్సీ విండో్ ద్వారా బయటపడ్డాడు. దీంతో వెంటనే బీహార్ రైల్వే సీపీఆర్ వో వినయ్ కుమార్ కి సమాచారం అందించి, తోటి ప్రయాణీకులతో కలిసి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నట్టు మీడియాకు వివరించారు.
చివరి నిమిషంలో సీటు మార్చుకోవడమే తనను ఈ ప్రమాదంనుంచి రక్షించిందని జర్నలిస్టు సంతోష్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 145కు చేరింది. రెండు బోగీలకుచెందిన సుమారు 200 మందికిగా పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం భారీ విషాదాన్ని మిగిల్చింది.