
అవయవదానానికి కపిల్ దేవ్ ప్రతిజ్ఞ
తాము మరణాంతరం అవయవ దానం చేయనున్నట్లు ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలు శనివారం న్యూఢిల్లీలో ప్రతిజ్ఞ చేశారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు న్యూఢిల్లీ యూరాలజీస్ట్ సోసైటీ అధ్వర్యంలో ఏయిర్ పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా అఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన యూసికాన్-2014 కార్యక్రమంలో వారిరువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్న వారిలో అత్యధికులకు అవయవదానంపై కనీస అవగాహన లేదని ఆ సోసైటీ అర్గనైజింగ్ సెక్రటరీ రాజీవ్ సూద్ వెల్లడించారు. దాంతో అవయవదానం చేసే వారు లేక పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ' హర్ జాన్ కో అమర్ బనానా హై' అనే స్లోగన్తో తమ సోసైటీ నడుం కట్టినట్లు వివరించారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించడం వల్ల మరణించిన వ్యక్తులు కూడా అమరత్వం పొందుతారన్నారు.