‘పగటి’కలే!
* వచ్చే ఖరీఫ్ నుంచి సాగుకు పగటిపూట 9 గంటల కరెంటు అనుమానమే
* ఇక మిగిలింది ఎనిమిది నెలలు మాత్రమే
* కార్యరూపం దాల్చని రూ. 2 వేల కోట్ల పనులు
* ఇప్పటివరకు టెండర్లు కూడా పిలవని వైనం
* రెట్టింపు కానున్న విద్యుత్ డిమాండ్
* కరెంటు అందినా సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచాలి
* హామీ అమలుకు మరో రెండు, మూడేళ్లు పట్టే అవకాశం
* అప్పటిదాకా పగలు 4 గంటలు, రాత్రిపూట 4 గంటలు ఇవ్వడంపై యోచన
* ప్రస్తుతం సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం 8,800 మెగావాట్లు
* 9 గంటల కరెంటుకు కావాల్సిన సామర్థ్యం 14,000 మెగావాట్లు
* రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 6,0006,500 మెగావాట్లు
* 9 గంటల కరెంట్‌తో పెరగనున్న డిమాండ్ 10,50011,000 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి పగటిపూటే కరెంట్.. 9 గంటలపాటు నిరంతర సరఫరా.. వచ్చే ఖరీఫ్ నుంచే అందిస్తాం..’ ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయి ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా కనిపించడం లేదు. ఈ హామీ నెరవేర్చడానికి కేవలం 8 నెలల సమయమే మిగిలి ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం దాదాపు రెట్టింపు స్థాయికి చేరాలి. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా పనులు కార్యరూపం దాల్చకపోవడంతో హామీ అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
డిమాండ్ మేరకు విద్యుత్‌ను సమీకరించుకున్నా... ఆ విద్యుత్‌ను సరఫరా, పంపిణీ చేసే వ్యవస్థలను స్వల్ప కాలంలో సిద్ధం చేసుకోవడం కాని పనే! ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకం అమలును మరో ఏడాది, రెండేళ్ల వరకు వాయిదా వేసుకోక తప్పదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. హామీని పాక్షికంగానైనా నెరవేర్చేందుకు కొన్ని మార్పులు చేయవచ్చనే చర్చ జరుగుతోంది. పగలు 4 గంటలు, రాత్రి 4 గంటలు చొప్పున 8 గంటల విద్యుత్ సరఫరా చేసే అంశం ఉన్నత స్థాయి వర్గాల పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 6,000-6,500 మెగావాట్ల మధ్యే ఉంది. ఈ విద్యుత్ అందించేందుకే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
ఇక సాగుకు వచ్చే ఏప్రిల్ నుంచి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. ఈ డిమాండ్ ఒక్కసారిగా 10,500-11,000 మెగావాట్లకు పెరుగుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత రబీలో (2015 మార్చి 28న) అత్యధికంగా 6,755 మెగావాట్ల సరఫరా జరగ్గా.. అందులో వ్యవసాయ విద్యుత్ వాటా 2,500 మెగావాట్లుగా ప్రభుత్వం లెక్కలేసింది. ప్రస్తుతం రెండు, మూడు విడతల్లో 6 గంటలకు మించకుండా సరఫరా చేస్తేనే వ్యవసాయ రంగానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇక పగలే 9 గంటలు నిరంతరంగా సరఫరా చేస్తే ఒక్క వ్యవసాయానికే ఈ డిమాండ్ 6,370 మెగావాట్లకు పెరగనుందని ప్రభుత్వ అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం డిమాండ్ 10,500-11,000 మెగావాట్ల మధ్య ఉండనుంది. అంటే.. 9 గంటల పథకానికి అదనంగా 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ అంచనాల ఆధారంగానే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సరఫరా, పంపిణీ రంగాలను పటిష్టం చేసేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల అంచనాలతో చేయాల్సిన పనులకు కేవలం 8 నెలలే మిగిలి ఉన్నాయి.
ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే...
రాష్ట్రంలో సాగుకు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం లభ్యమవుతున్న 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు అదనంగా మరో 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో జెన్‌కో నిర్మిస్తున్న కేటీపీపీ-2 యూనిట్‌తోపాటు జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సౌర విద్యుత్ టెండర్లు ముగిసిన నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నిర్మాణంలో ఉన్న గాయత్రి థర్మల్ ప్రాజెక్టు నుంచి 600 మెగావాట్లు, థర్మల్ టెక్ ప్రాజెక్టు నుంచి 269 మెగావాట్ల వాటాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అనుకున్నట్లే ఈ ప్రాజెక్టులన్నీ గడువులోగా పూర్తై అదనంగా 5,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. సౌర విద్యుత్కేంద్రాలు ఆలస్యమైతే మాత్రం 2,500 మెగావాట్లకు మించి సామర్థ్యం పెరగదు.
సరఫరా, పంపిణీలే అసలు సమస్య
సాగుకు 9 గంటల విద్యుత్ పథకం అమలు కోసం సరిపడా విద్యుత్‌ను సమీకరిస్తే సరిపోదు. ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలూ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రం 8,800 మెగావాట్ల విద్యుత్ సరఫరా, పంపిణీ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. వచ్చే ఏప్రిల్‌లోగా 14,000 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంది. అలాగే కేవలం వ్యవసాయ అవసరాల కోసమే గ్రామగ్రామాన ప్రత్యేక సరఫరా, పంపిణీ లైన్లను వేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టినా రాష్ట్రంలోని 8,600 గ్రామాల్లో ఏకకాలంలో పూర్తి చేయడం సాధ్యం కాని పని. సరఫరా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ట్రాన్స్‌కో రూ.950.50 కోట్లతో, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి డిస్కంలు రూ.1,066.98 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనుల కోసం ఇంకా టెండర్లే పిలవలేదు.