హవ్వా.. పబ్లిక్ లో సీఎం ఏం చేశారో తెలుసా?
హవ్వా.. పబ్లిక్ లో సీఎం ఏం చేశారో తెలుసా?
Published Sun, Dec 25 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
తనను తాను సోషలిస్టునని చెప్పుకునే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. శనివారం శాండల్ వుడ్ వెటరన్ నటుడు కన్నుమూసిన సందర్భంగా మైసూరులో ఆయన గృహానికి వెళ్లిన సిద్ధారామయ్య పీఏ చేత బూట్లు తొడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
పేరు బయటకు తెలపడానికి ఇష్టపడని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి చేతన రామారావు మరణించిన వార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి.. శనివారం ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లారు. అనంతరం చేతన రామారావు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు నిల్చున్నారు. ఇంతలో సిద్ధారామయ్య పీఏ కుమార్ అక్కడకు చేరుకుని బూట్లు తొడిగినట్లు చెప్పారు.
ఈ సంఘటనను చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురి కాగా సీఎం మాత్రం స్పందించలేదని తెలిపారు. అసిస్టెంట్లతో ఇలాంటి పనులు చేయించే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారని ఆ సమయంలో సీఎం సిద్ధారామయ్యతో పాటు ఉన్న కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. అందరూ సమానులే అనే సీఎం ఇలాంటి పనులు చేస్తుండటం సిగ్గు చేటని అన్నారు. కాగా, ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన సిద్ధారామయ్య తాను ఎవరిచేతా బూట్లు తొడిగించుకోలేదని చెప్పారు. తెలిసిన వ్యక్తి ఒకరు తన బూట్లు వెదకడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటో తీశారని అన్నారు.
Advertisement
Advertisement