కశ్మీర్.. ఆరని చిచ్చు! | Kashmir dispute between India-Pakistan: a bumpy history | Sakshi
Sakshi News home page

కశ్మీర్.. ఆరని చిచ్చు!

Published Tue, Mar 28 2017 4:47 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

కశ్మీర్.. ఆరని చిచ్చు! - Sakshi

కశ్మీర్.. ఆరని చిచ్చు!

ఏడు దశాబ్దాలుగా రగులుతున్న జమ్మూకశ్మీర్ సమస్య
ఉపఖండం స్వాతంత్ర్యంతో పాటే పెను వివాదానికి బీజం
‘విలీనం’ నిర్ణయంపై సంస్థానాలకు స్వేచ్ఛనిచ్చిన బ్రిటిష్
కశ్మీర్పై పాక్ దురాక్రమణ.. భారత్లో సంస్థానం విలీనం
♦  ఐరాస జోక్యంతో కాల్పుల విరమణ.. బలగాలు యథాతథం
భారత్ – పాక్ మధ్య మూడు యుద్ధాలు.. చైనాతో మరో వార్
♦  కొంత భాగం పాక్ ఆక్రమణలో.. మరికొంత చైనా ఆక్రమణలో
♦  సమస్య పరిష్కారానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రతిపాదనలు
ఇప్పటివరకూ ఫలించని చర్చలు.. ఎల్లప్పుడూ ఉద్రిక్తతలే
♦  కశ్మీర్ మొత్తం స్వతంత్రం కావాలని ఒక వర్గం ఉద్యమం


ఒక సంస్థానం.. రెండు ప్రధాన మతాలు.. మూడు పొరుగు దేశాలు.. నాలుగు యుద్ధాలు.. ఐదు ముక్కలు.. ఏడు దశాబ్దాలు... ఇదీ కశ్మీర్ కథ! భారత్ – పాకిస్తాన్ల మధ్య ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ వివాదం మరోసారి రాజుకుంటోంది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకునివున్న కశ్మీర్లోని గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతాన్ని ఐదో రాష్ట్రంగా కలిపివేసుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ వివాదం మళ్లీ ఉధృతమవుతోంది. పాక్ ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని భారత్ కఠిన స్వరం వినిపిస్తే.. కశ్మీర్ మొత్తాన్నీ విముక్తం చేస్తామని, పూర్వ కశ్మీర్ రూపంలో భారత్లో విలీనం చేస్తామని భారత ప్రభుత్వ నాయకులు దీటుగా బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కశ్మీర్ వివాదం ఎందుకు ఎలా ఎప్పుడు మొదలైంది.. అప్పటి నుంచీ జరిగిన పరిణామాలేమిటి.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి.. ఏ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంది.. అనే అంశాలపై ‘సాక్షి’ ఫోకస్!

(కశ్మీర్‌ను కలిపేసుకుంటాం: పాక్‌ సంచలన ప్రకటన)


ఇటు స్వాతంత్ర్యం.. అటు సంస్థాన స్వేచ్ఛ.. : భారత ఉపఖండాన్ని రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించిన బ్రిటిష్ పాలకులు 1947లో ఈ ప్రాంతాన్ని ద్విజాతి సిద్ధాంతం ప్రకారం భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజించి స్వాతంత్ర్యం ప్రకటించారు. అదే సమయంలో దాదాపు 562 సంస్థానాల (ప్రిన్స్లీ స్టేట్స్) మీద కూడా బ్రిటిష్ పాలన అంతమైంది. ఆ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్లో కానీ, పాకిస్తాన్లో కానీ విలీనం అయ్యేందుకు లేదా స్వతంత్రంగానే కొనసాగేందుకు నాటి భారత స్వతంత్ర చట్టంలో వీలు కల్పించారు. ఈ సంస్థానాల్లో జమ్మూకశ్మీర్ అతి పెద్దది. అంతేకాదు.. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. స్వతంత్రం వచ్చేనాటికి ఆ రాష్ట్రంలో మెజారిటీ జనాభా ముస్లిం మతస్తులు. పాలకుడు మహారాజా హరిసింగ్ హిందూ మతస్తుడు. ఆయన కశ్మీర్ స్వతంత్ర దేశంగానే ఉండిపోవాలని భావించాడు.

పాక్ దురాక్రమణ.. ఆజాద్ కశ్మీర్ ప్రకటన.. : అయితే.. కశ్మీర్ను భారత్లో కలిపేందుకు హరిసింగ్ మొగ్గు చూపుతున్నాడని భావించిన పాకిస్తాన్.. బలవంతంగా ఆ ప్రాంతాన్ని తనలో కలుపుకోవాలని ప్రణాళిక రచించింది. పాక్ వైపు నుంచి కశ్మీర్కు నిత్యావవసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు.. సరిహద్దు రాష్ట్రాల్లోని గిరిజన ముస్లింలను సాయుధులను కశ్మీర్లోకి పంపించింది. అక్కడున్న తనకు అనుకూలమైన ముస్లిం గిరిజనులతో కలిసి ‘తిరుగుబాటు’ చేయించింది. అందులో పాక్ సైనికులు చాలా మంది ‘సెలవు’ మీద వచ్చి పాలుపంచుకున్నారు. ఒకరకంగా కశ్మీర్ భూభాగంపై సైనిక ఆక్రమణ ప్రారంభించింది. మహారాజా హరిసింగ్ సైన్యం వారిని నిలువరించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. మత, లింగ బేధాలు లేకుండా వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. అక్టోబర్ నాటికి పశ్చిమ జిల్లాల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యం సాయంతో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అదే నెల 24వ తేదీన ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్గా ప్రకటించుకున్నారు. మరోవైపు.. కశ్మీర్ ఉత్తర భాగంలోని గిల్గిట్ ఏజెన్సీ ప్రాంతపు సైనిక కమాండర్ (మహారాజా హరిసింగ్ సైన్యం కమాండర్) నవంబర్1న తిరుగుబాటు చేసి ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. కానీ 15 రోజులకే పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఆ ప్రాంతాన్ని నేరుగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

భారత్లో విలీనం..ప్రజాభిప్రాయ ప్రస్తావన.. : ఈ పరిస్థితుల్లో మహారాజా హరిసింగ్ సైన్యం బలహీనపడటంతో భారత్ నుంచి సైనిక సాయం కోరుతూ కశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి అంగీకరించారు. భారత్లో కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుతూ అక్టోబర్ 26న విలీన ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని అంగీకరించే ముందు భారత ప్రభుత్వం అందులో ఒక నిబంధనను చేర్చింది. ‘కశ్మీరీ ప్రజలు ఎక్కడ నివసించాలన్నది నిర్ణయించాల్సింది మహారాజా కాదు.. కశ్మీరీలే స్వయంగా నిర్ణయించాలి.. కాబట్టి ఆక్రమణదారులను తరిమేసిన తర్వాత కశ్మీర్ విలీనం అంశాన్ని ప్రజాభిప్రాయానికి నివేదిస్తామ’నేది ఆ నిబంధన సారాంశం. ఈ విలీనం ఒప్పందానికి అప్పటికే కశ్మీర్లో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ (పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా) అంగీకారం తెలిపింది. దీంతో 1947 అక్టోబర్ 27వ తేదీన భారత్ తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. మహారాజా సైన్యం, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు కలిసి శ్రీనగర్లో ఆక్రమణదారులను అడ్డుకున్నారు.  అదే నెల 30వ తేదీన షేక్ అబ్దుల్లా ‘ప్రధానమంత్రి’గా కశ్మీర్లో అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ జిల్లాల్లోని తిరుగుబాటుదారులు, పాక్ సైనికులు బారాముల్లా సెక్టార్ వరకూ చొచ్చుకొచ్చారు. అప్పటికే శ్రీనగర్ చేరుకున్న భారత సైన్యం వారిని తిప్పికొట్టింది. 1948 మే నెలలో పాకిస్తాన్ సైన్యం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఇలా మొదలైన భారత్ – పాక్ యుద్ధం ఆ ఏడాది చివరి వరకూ కొనసాగింది.

ఐరాస జోక్యం.. కాల్పుల విరమణ.. : ఈ పరిస్థితుల్లో సంధి కోసం భారత్ చేసిన ప్రయత్నాలు, పాక్తో చర్చలు విఫలమయ్యాయి. దీంతో భారత్ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కోరింది. ఆ మేరకు 1948 ఏప్రిల్ 21న సమితి భద్రతా మండలి 47వ తీర్మానం చేసింది. ఇరు దేశాలూ తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని.. పాకిస్తాన్ తన సైనికులను, గిరిజన తిరుగుబాటుదారులను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ కూడా కశ్మీర్లో తన సైనిక బలగాలను కనీస స్థాయికి తగ్గించాలని చెప్పింది. అనంతరం భారత్లో లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించింది. అయితే.. 1949 జనవరి 1వ తేదీన గానీ ఈ కాల్పుల విరమణ అమలులోకి రాలేదు.

బలగాల ఉపసంహరణపై ప్రతిష్టంభన..: కానీ.. కశ్మీర్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్యా అంగీకారం కుదరలేదు. ఐరాస ప్రతినిధి బృందం రెండుసార్లు పర్యటించి భద్రతామండలికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం సైనిక బలగాల ఉపసంహరణకు రెండంచెల పరిష్కారాన్ని ఐరాస సూచించింది. ‘తొలుత పాక్ తన సైనిక బలగాలు, సాయుధ తిరుగుబాటుదారులను కశ్మీర్ భూభాగం నుంచి ఉపసంహరించుకోవాలి. ఐరాస ప్రతినిధి బృందం కశ్మీర్లో పర్యటించి పాక్ బలగాల ఉపసంహరణ పూర్తయిందని భారతదేశానికి నిర్ధారిస్తుంది. అప్పుడు భారత్ తన సైనిక బలగాలను భారీగా తగ్గించాలి. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవచ్చు’ అనేది ఆ పరిష్కారం.

ఈ ప్రతిపాదనను భారత్ ఆమోదించింది. కానీ పాక్ తిరస్కరించింది. నిజానికి.. మహారాజా హరిసింగ్ భారత్తో విలీనం ఒప్పందం చేసుకున్నందు వల్ల.. చట్టపరంగా కశ్మీర్ తనకు చెందిన భూభాగమే అనేది భారత్ అభిప్రాయం. అక్కడ తిరుగుబాటుదారులకు సాయం చేయడమే కాకుండా.. పాక్ సైన్యం స్వయంగా జోక్యం చేసుకోవడాన్ని భారత భూభాన్ని ఆక్రమించడంగానే పరిగణించాలన్నది భారతదేశ వాదన. భారత్లో చట్టపరంగా జరిగిన విలీనాన్ని ధృవీకరించుకోవడానికి మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని.. ఆ విషయంలో పాక్కు తనతో సమానమైన అవకాశాలు ఉండవని భారత్ ఉద్ఘాటిస్తోంది. అయితే.. కశ్మీర్ ప్రజలు ‘తిరుగుబాటు’ చేసినందున పాలకుడైన మహారాజా చేసుకున్న విలీనం ఒప్పందం చెల్లదని పాక్ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్ అంశం గత డెబ్భై ఏళ్లుగా పరిష్కారం లేకుండా స్తంభించిపోయింది.

డిక్సన్ మధ్యవర్తిత్వం.. నెహ్రూ ప్రతిపాదన..: 1950లో ఐరాస నియమించిన మధ్యవర్తి సర్ ఒవెన్ డిక్సన్ కశ్మీర్లో పర్యటించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఆయన చొరవతో భారత్ – పాకిస్తాన్ల మధ్య ఐదు రోజుల పాటు శిఖరాగ్ర సమావేశం జరిగింది. కశ్మీర్ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అసాధ్యమని డిక్సన్ ఆ సమావేశం ముగింపులో ప్రకటించారు. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్నెహ్రూ ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రతిపాదించారు. జమ్మూ, లదాఖ్ ప్రాంతాలు భారత్కు చెందేటట్లు.. ఆజాద్ కశ్మీర్, ఉత్తర ప్రాంతాలు (గిల్గిత్ - ) పాక్కు చెందేటట్లు.. కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటట్లు చేయడం ఆ ప్రణాళిక. అయితే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటపుడు కశ్మీర్లో ఉన్న షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పక్కనపెట్టాలని పాక్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ షరతు పెట్టారు. ఇందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

అమెరికాతో పాక్ ఒప్పందం.. ప్లెబిసైట్కి నెహ్రూ నో.. : 1953లో పాక్తో చర్చల్లో భారత్ ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది. ఆరు నెలల్లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ అధికార వ్యవస్థను నెలకొల్పాలని ఆగస్టులో ప్రతిపాదించారు. అంతకుముందటి ఆలోచనకు భిన్నంగా.. జమ్మూకశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, వచ్చే ఫలితాలను బట్టి ఆయా ప్రాంతాలను రెండు దేశాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే.. పాక్ ఆలోచన వేరేలా వుంది. అప్పటికే అమెరికా నుంచి సైనిక సాయం పొందేందుకు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. పాక్ ఆ ఒప్పందం చేసుకుంటే కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదనను తాను ఉపసంహరించుకుంటానని నెహ్రూ హెచ్చరించారు. అన్నట్లే.. పాక్ ఒప్పందం చేసుకోగా నెహ్రూ 1954లో ప్రజాభిప్రాయసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. యథాతథ స్థితి ఒక్కటే మిగిలిన ప్రత్యాయమన్నారు. దానికీ పాక్ నిరాకరించడంతో చర్చల నుంచి ఆ అంశాన్ని కూడా నెహ్రూ తొలగించారు.

చైనాతో యుద్ధం.. ఆక్సాయ్చిన్ పరాధీనం.. : 1962లో భారత్ – చైనాల మధ్య యుద్ధం జరిగింది. జమ్మూకశ్మీర్లోని కొంత భూభాగం తమదని చైనా తన బలగాలను అక్కడ మోహరించడంతో భారత్ దానికి అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో చైనా త్వరగానే గెలిచింది. అప్పుడు జమ్మూకశ్మీర్లోని ఆక్సాయ్చిన్ ప్రాంతాన్ని చైనా తనలో కలుపుకుంది. ఇక పాకిస్తాన్ సైతం తన ఆధీనంలో ఉన్న కశ్మీర్ నుంచి కారాకోరం ప్రాంతంలోని కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించింది. కశ్మీర్లో చైనా ఆక్రమించిన భూభాగం తనదేనని భారత్ వాదిస్తున్నప్పటికీ.. అక్కడ ఇరు దేశాల ఆధీనంలోని భూభాగాన్ని విడదీసే ప్రాంతాన్ని ‘వాస్తవాధీన రేఖ’గా వ్యవహరిస్తున్నారు.

మళ్లీ పాక్ దుస్సాహసం.. తాష్కెంట్ ఒప్పందం..: ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఆయుధ సంపత్తితో బలపడిన పాకిస్తాన్ 1965లో మరోసారి కశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించింది. ‘ఆపరేషన్ జీబ్రాల్టర్’ పేరుతో వేలాది మంది రజాకార్లు, ముజాహిదీన్లకు సైనిక శిక్షణ ఇచ్చి జమ్మూకశ్మీర్లోకి చొరబడేలా చేసిన పాక్.. ఈసారి యుద్ధం సులభంగా గెలుస్తామని భావించింది. కానీ ఆ ముజాహిదీన్లను కశ్మీరీలే పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించడంతో ఆ ప్రణాళిక పారలేదు. దీంతో సెప్టెంబర్ 1వ తేదీన కాల్పుల విరమణ రేఖ వెంబడి సైనిక దాడి మొదలుపెట్టింది. భారత్ యుద్ధాన్ని విస్తరిస్తూ అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం మీద కూడా దాడి చేసింది. 23 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో తాష్కెంట్లో సమావేశమైన ఇరు దేశాల అధినేతలు సంధి చేసుకున్నారు. తమ తమ సైనిక బలగాలను మునుపటి స్థాయికి ఉపసంహరించుకునేలా ఒప్పందం చేసుకున్నారు.

బంగ్లా పోరులో పాక్ పరాజయం.. సిమ్లా ఒప్పందం.. : మళ్లీ 1971లో తూర్పు పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటుకు భారత్ మద్దతిచ్చింది. భారత్, పాకిస్తాన్ల మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాక్ ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. పాక్ సైన్యం భారత్కు లొంగిపోయింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్కు బందీలయ్యారు. దాదాపు ఐదు వేల చదరపు మైళ్ల పాక్ భూభాగం కూడా భారత్ సైన్యం చేతిలో ఉంది. ఈ క్రమంలో సిమ్లాలో ఇరు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం.. తమ వద్ద బందీలుగా ఉన్న పాక్ సైనికులను, తమ ఆధీనంలో ఉన్న పాక్ భూభాగాన్ని తిరిగి ఇచ్చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తంచేసింది. కానీ.. చర్చలు ఓ కొలిక్కిరాలేదు.

పరిష్కారానికి భుట్టో అంగీకారం.. తర్వాత మారిన మాట.. : చివరికి ఇరు దేశాల ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోలు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ‘కశ్మీర్ సమస్యను అంతిమంగా పరిష్కరించుకోవాల్సిందేనని భుట్టో అంగీకరించారు. కాల్పుల విరమణ రేఖ పేరును ‘నియంత్రణ రేఖ’గా మార్చడానికి.. క్రమంగా ఇరు దేశాల మధ్య న్యాయసమ్మతమైన సరిహద్దుగా మార్చడానికి అంగీకరించారు. పాక్ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్లోని భూభాగాలను పాక్ సమాఖ్యలో విలీనం చేయడానికి చర్యలు చేపడతానని ఒప్పుకున్నారు’ అని దౌత్యాధికారి జె.ఎన్.దీక్షిత్ ఒక సందర్భంలో వివరించారు. అయితే.. కశ్మీర్ వివాదానికి తుది పరిష్కారం విషయాన్ని ఒప్పందం ప్రకటనలో చేర్చవద్దని.. అలా చేస్తే పాక్లో శైశవ దశలో ఉన్న పౌర ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని, సైన్యం ఇతర అతివాద శక్తులు అధికారంలోకి వస్తాయని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు తుది పరిష్కారం ప్రస్తావన లేకుండా సిమ్లా ఒప్పందాన్ని రూపొందించి ఇరు దేశాలూ సంతకాలు చేశాయి.

 శాంతియుత మార్గాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని, నియంత్రణ రేఖను గౌరవించాలని అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర కానీ, బహుళపక్ష చర్చల పాత్ర కానీ ముగిసిపోయినట్లేనని భారత్ పేర్కొంది. భారత వైఖరిని అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు సమర్థించాయి. అయితే.. పాక్ ఈ ఒప్పందం ప్రకారం తాను ఇంకా ఐరాసని పరిష్కారం కోసం కోరవచ్చునని చెప్తోంది.  కశ్మీర్‌ అంశానికి తుది పరిష్కారం కోసం పాక్‌ ప్రజలను, పార్లమెంటును సంసిద్ధం చేసేందుకు తనకు కొంచెం సమయం కావాలని భుట్టో కోరినట్లు చెప్తారు. కానీ.. తర్వాత ఆయన మాట మార్చారని భారత్‌ ఆరోపిస్తోంది. జమ్మూకశ్మీర్‌ స్వయం నిర్ణయాధికారం విషయంలో తాను రాజీపడలేదని భుట్టో కొంత కాలం తర్వాత ప్రకటించారు.

రెండు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు.. కశ్మీర్ కల్లోలం.. : అనంతరం భారత్, పాక్ రెండు దేశాల్లోనూ అంతర్గత రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోయాయి. భారత్లో 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించడం, 1978 ఎన్నికల్లో అధికారం కోల్పోవడం జరిగాయి. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగి జనరల్ జియావుల్ హక్ నియంతృత్వ పాలనలోకి వెళ్లింది. 1977లో జుల్ఫికర్ అలీ భుట్టోను సైనిక ప్రభుత్వం ఉరితీసింది. మరోవైపు పాక్ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. 1980వ దశకం చివర్లో కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఊతమిస్తూ కల్లోలం సృష్టించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడానికి 90వ దశకం చివరి నాటికి రెండు దేశాలూ అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించగల క్షిపణులను విజయవంతంగా పరీక్షించాయి. దీంతో ఉపఖండం ఎప్పుడు విస్ఫోటనమవుతుందా అన్నంత ఆందోళన ప్రపంచమంతా నెలకొంది.

వాజపేయి బస్సు దౌత్యం.. పాక్ కార్గిల్ యుద్ధం.. : 1999లో నాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పాక్తో ఉద్రిక్తతలను చల్లర్చడం కోసం ప్రయత్నించారు. ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి పాక్లోని లాహోర్కు బస్సు సర్వీసును ప్రారంభిస్తూ.. ఆ బస్సులో స్వయంగా లాహోర్ వెళ్లారు. వాజపేయి చొరవతో కశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వైఖరి తగ్గుముఖం పడుతుందని ప్రపంచమంతా ఆశించింది. కానీ.. ఒకవైపు భారత్ స్నేహ హస్తం చాస్తుండగా పాక్ సైన్యం కార్గిల్లో చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న విషయం బయటపడటంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. పాక్ సైనిక చొరబాటును తిప్పికొట్టేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. మే నెలలో కార్గిల్లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగింది. జూన్ మొదటి వారానికి పాక్ వెనుకకు తగ్గింది.

ముందుకు సాగని శాంతి చర్చలు.. : అప్పటి నుండీ భారత్ – పాక్ సంబంధాలు యథావిధిగా ఒడిదుడుకుల్లోనే సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య చాలా పర్యాయాలు శాంతి ప్రయత్నాలు, విశ్వాస నిర్మాణ చర్యలు, వివిధ స్థాయిల్లో ద్వైపాక్షిక చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నా.. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులతో అవన్నీ నిష్ఫలంగానే మిగులుతున్నాయి. మరోవైపు భారత్లోని జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఒక వర్గం స్వాతంత్ర్యం కావాలని ఉద్యమిస్తూనే ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, దానిని అణచివేసేందుకు భారత్ సైనిక చర్యలతో కశ్మీర్ రక్తమోడుతూనే ఉంది.

జమ్మూకశ్మీర్ ‘వాస్తవ’ స్వరూపం...
వాస్తవానికి మొత్తం జమ్మూకశ్మీర్ విస్తీర్ణం 1,35,943 చదరపు కిలోమీటర్లు. 1991లో జనాభా 1.16 కోట్లు. 1947లో జమ్మూకశ్మీర్ సంస్థానం మొత్తం భారతదేశంలో విలీనమైనప్పటికీ.. ఆ భూభాగం మొత్తం భారత్ ఆధీనంలో లేదు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, చైనాల మధ్య ఈ రాష్ట్రం మూడు ముక్కలుగా విడిపోయివుంది. మరో చిన్న ముక్క పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉన్నప్పటికీ.. ‘స్వతంత్ర’ ప్రాంతంగా వ్యవహరిస్తున్నారు.

1) జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం సుమారు 43 శాతం భూభాగం మాత్రమే భారత్ పాలనలో ఉంది. జమ్మూ, కశ్మీర్ లోయ, లదాఖ్, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలతో కూడిన జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా భారత్లో అంతర్భాగంగా ఉంది. దీనిని భారత్ ఆక్రమిత కశ్మీర్ అని పాక్ చెప్తుంటుంది. 2) మరో 37 శాతం భూభాగం పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. 1947లో ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంది. దానిని రెండు భాగాలుగా విభజించారు.

2) ఒక ప్రాంతాన్ని ‘ఆజాద్ కశ్మీర్’ అని వ్యవహరిస్తారు. మరొక ప్రాంతాన్ని గిల్గిత్ – బాల్తిస్తాన్ (ఉత్తర) ప్రాంతంగా అభివర్ణిస్తున్నారు. భారత్ ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని చెప్తుంది.

3) ఆక్సాయ్చిన్ ప్రాంతంతో పాటు.. దేమ్చోక్ జిల్లా, షక్స్గామ్ లోయ ప్రాంతాలు మరో పొరుగు దేశమైన చైనా ఆధీనంలో ఉన్నాయి. 1962లో భారత్ – చైనా యుద్ధంలో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆ దేశం ఆక్రమించుకుంది. పాక్ తన ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఉత్తర ప్రాంతంలో షెక్స్గామ్ వద్ద గల కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించింది.

జమ్మూకశ్మీర్ (భారత రాష్ట్రం): విస్తీర్ణం 81,300 చ.కి. (1991లో జనాభా: 73 లక్షలు)

ప్రాంతం   విస్తీర్ణం బౌద్ధమతస్తులు హిందువులు ముస్లింలు ఇతరులు
కశ్మీర్ లోయ 11,100 చ.కి. - 4% 95% -
జమ్ము 15,900 చ.కి. - 66% 30% 4%
లదాఖ్ 54300 చి.కి.    50% 50% - 45% 3%
పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ విస్తీర్ణం 54,650 చ.కి. (1991లో జనాభా: 43 లక్షలు)      
గిల్గిట్–బాల్తిస్తాన్ 47,900 చ.కి. - - 99% -
ఆక్రమిత కశ్మీర్ 6,670 చ.కి. - - 99% -

చైనా ఆధీనంలో ఉన్న కశ్మీర్: విస్తీర్ణం 6,178 చ.కి. (జనాభా లెక్కలు తెలియవు)

ఆక్సాయ్చిన్     3,172 చ.కి.
షెక్స్గామ్     3,006 చ.కి.

పాక్ ఆక్రమించిన భూభాగంలోని గిల్గిట్ – బాల్తిస్తాన్ను ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా పరిగణిస్తూ వచ్చింది. కొంత కాలం కిందట ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ శాసనసభ, ముఖ్యమంత్రితో కూడిన ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. అది పేరుకే. ప్రజలకు పౌరసత్వం, ఓటు హక్కు వంటివి మృగ్యం. వాస్తవంగా పాక్ విదేశాంగ శాఖ నేరుగా ఈ ప్రాంత పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాంతాన్నే ఇప్పుడు ఐదో రాష్ట్రంగా కలిపివేసుకోవాలనేది పాక్ ప్రయత్నం. చైనా – పాక్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతం నుంచే నిర్మిస్తున్నారు. కానీ.. భారత్తో చైనా, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు మధ్య ఆసియా ప్రాంతాలతో ఈ భూభాగం అనుసంధానం చేస్తుంది. కాబట్టి ఇది భారతదేశానికి చాలా కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement