‘మహా’ ఒప్పందం సూత్రప్రాయమే
నెలాఖరులోగా పూర్తి ఒప్పందం
► అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
► తెలంగాణ-మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటైంది
► 19న ఇరు రాష్ట్ర ఇంజనీర్ల చర్చలు మొదలవుతాయి
► కాంగ్రెస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
► సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై కుట్ర చేశారు
► అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి పూర్తి కాకుండా చూశారు
► గతంలో ఒప్పందం కుదుర్చుకుంటే ఎందుకు అమలు చేయలేదు?
► మిషన్ భగీరథ పూర్తయితే ఓట్లు రావని ప్రతిపక్షాల భయం
► వర్సిటీలకు కావాలనే వీసీలను నియమించలేదు
► ఆలస్యమైనా చేస్తాం.. తప్పులు మాత్రం చేయం
► హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలు దురదృష్టకరం
► ఆర్టీసీని పటిష్టం చేసి ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్:
గోదావరిపై అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెలాఖరులోగా ఒప్పందం కుదురుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రతో సూత్రప్రాయ ఒప్పందం కుదిరిందని, ఈ నెలలో జరిగే ఉన్నతస్థాయి సమావేశాల అనంతరం ఆ ఒప్పందానికి పరిపూర్ణత వస్తుందని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర నియంత్రణ బోర్డు ఉండేదని, ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మూడంచెల ‘ఇంటర్ స్టేట్ బోర్డు’ ఏర్పాటైందని వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. మహారాష్ట్రతో ఒప్పందానికి సంబంధించి ఈ నెల 19 నుంచి సమావేశాలు మొదలవుతాయన్నారు. 19న ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో, తర్వాత నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖల మంత్రులు సమావేశమవుతారని చెప్పారు. అనంతరం అత్యున్నత స్థాయి(అపెక్స్ బాడీ) సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల వారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటారని వెల్లడించారు.
ఒప్పందంపై బ్లాక్ డే అంటారా?
మహారాష్ట్రతో ఇటీవల ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం పాతదేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మీరు పూర్తి బాధ్యతారహితంగా మాట్లాడారు. మేం రాష్ట్రానికి తలవంపులు తెచ్చామని, బ్లాక్ డే అని అన్నారు. తలవంపులు తెచ్చింది మేం కాదు.. మీరు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘సమైక్య రాష్ట్రంలో అంతర్రాష్ట్ర జల వివాదాలు, పర్యావరణ అనుమతుల చట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను ఇరికించి పనులు కాకుండా కుట్ర పన్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గతంలో మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు అమలు చేయలేదు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండానే తమ్మిడిహెట్టి వద్ద రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. ‘మీరుపెట్టిన ఖర్చు వృథా అవుతుంది’ అని నాటిమహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చెప్పినా స్పందించలేదు. ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇష్టారీతిన పనులు చేశారు’’ అని సీఎం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో.. పొరుగు రాష్ట్రాలతో చెరిగిపోయిన సుహృద్భావ వాతావరణం పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథను దేశంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాయన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్‌కుమార్ తెలంగాణలో అమలు చేస్తున్న నీటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మిషన్ భగీరథ పూర్తయితే ఓట్లు రావనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుంది. మిషన్ భగీరథకు రుణం ఇవ్వొద్దంటూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హడ్కోకు లేఖ రాసి.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆరు నూరైనా ఈ డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలకు, 12 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తాం’’ అని సీఎం పునరుద్ఘాటించారు. ‘‘రాష్ట్రం వచ్చిన 9 నెలల తర్వాత నుంచి అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. కరువు రావడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిందని, అందుకే ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను ఇవ్వగలుగుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014-15తో పోల్చితే 2015-16లో 16 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసిన విషయాన్ని మరిచారా?’’ అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుతో లింకు లేకుండా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పథకాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పం కాబట్టే ప్రజలు తమను గౌరవిస్తున్నారన్నారు.
‘మిషన్’ను అప్రతిష్టపాలు చేయొద్దు
‘‘మిషన్ కాకతీయ పనులు ప్రారంభం కాకముందే కమీషన్ కాకతీయ అంటూ విమర్శలు చేశారు. మీ హయంలో అలా జరిగాయి కాబట్టి ఇప్పుడు అలా జరుగుతున్నాయని అనుకుంటున్నారు. రాష్ట్రానికి చెరువులు ప్రాణాధారం. వాటికి జీవం పోసేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయను అప్రతిష్ట పాలు చేయకండి’’ అని సీఎం ప్రతిపక్షాలకు సూచించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన 57 వేల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, ఇంకా పనులు ప్రారంభం కాని వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో అవకాశం ఇస్తామని తెలిపారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప కింది నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకే కేటాయిస్తామని, ఇంకా మిగిలిపోతే వాటిని ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామని హామీనిచ్చారు. ‘‘చిన్న ముల్కనూరులో ఇళ్లు కూల్చాలని నేనే చెప్పా. భారమైనా వంద శాతం ప్రభుత్వమే ఖర్చును భరించి నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తాం’’ అని స్పష్టంచేశారు. మైనార్టీల రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బీసీ కమిషన్ పరిశీలనకు పెట్టి అవరోధాలు ఎదురవకుండా అమలు చేస్తామన్నారు.
ఒకే విడతలో రుణమాఫీ అసాధ్యం
‘‘రైతు రుణమాఫీని ఒకే విడతలో మాఫీ చేసేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరినా.. సానుకూల స్పందన లేదు. దీంతో ఒకే విడతలో రుణమాఫీ చేయలేకపోతున్నాం’’ అని సీఎం తెలిపారు. ఆహార కల్తీని నిరోధించేందుకు హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మెదక్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘సూరత్, తిరుప్పూర్‌ను మించి వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు 6,160 ఎకరాలు కావాలంటూ దరఖాస్తులు అందాయి’’ అని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో 16 శాతం ఎగుమతులు పెరిగాయన్నారు. ఏరోస్పేస్ రంగానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. జంట నగరాల్లో శాంతి భద్రతలపై పోలీసు వ్యూహం ఫలించిందని పేర్కొన్నారు. ‘‘ఆర్టీసీకి హైదరాబాద్‌లో 3,800 బస్సులు ఉన్నాయి. నగర పరిధిలో సంస్థకు రూ.218 కోట్ల నష్టం వచ్చింది. పేదలకు ఉండే ఏకైక రవాణా మార్గం ఆర్టీసీ. దాన్ని పటిష్టం చేసి కాపాడుతాం’’ అని హామీ ఇచ్చారు.
వర్సిటీలను పరిపుష్టం చేస్తాం
‘ఉద్దేశ పూర్వకంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్ల నియామకం చేయలేదు. అవసరమైతే నాలుగు నెలలు ఆలస్యమైనా చేస్తాం. కానీ తప్పులు చేయం. వీసీలపై విచారణ జరిపితే ఒక్కొక్కరు 300 లేదా 400 ఉద్యోగాలు అమ్ముకుని వెళ్టినట్టు తేలింది. కొత్తగా యూనివర్సిటీలు పెట్టారు గానీ డబ్బులివ్వలేదు. వీసీల కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. చీఫ్ జస్టిస్‌తోపాటు, ఇతర జడ్జిలను ఛాన్స్‌లర్లుగా వ్యవహరించమని కోరాం. యూనివర్సిటీల గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. యూనివర్సిటీలకు గ్రాంటు ఇచ్చి పరిపుష్టం చేస్తాం. రోహిత్ వేముల మరణంపై వివాదం సృష్టించదలుచుకోలేదు. కారణం తెలుసుకున్నాం.. ఖండించాం. జేఎన్‌యూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలు దురదృష్టకరం. ఫిలాసఫీలు, సిద్ధాంతాలు తీసుకెళ్లి యూనివర్సిటీల్లో రుద్దుతున్నారు. బీఫ్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ అంటూ చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. దేశంలో ఎవరైనా కిస్ ఫెస్టివల్‌ను ఒప్పుకుంటారా? ’’ అని సీఎం చెప్పారు.
అమెరికాపైనా అప్పుల భారం
‘‘ప్రభుత్వ పథకాలతో అప్పుల భారం పెరుగుతుందని స్టీరియోటైప్ విమర్శ చేస్తున్నారు. అమెరికా కూడా రూ.1,140 లక్షల కోట్ల అప్పులో ఉంది. చైనా కూడా ఐదు ట్రిలియన్ డాలర్ల అప్పులో ఉంది. డబుల్ బెడ్‌రూంలకు అయ్యే రూ.12 వేల కోట్లు హడ్కో ద్వారా రుణం తెస్తాం. 2019-20 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుకుంటుంది. అప్పటికల్లా రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది’’ అని సీఎం అన్నారు.
అసెంబ్లీ స్థానాలు 153కు పెంచాలి
‘‘శాసన సభ స్థానాలు పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఎమ్మెల్యే స్థానాలు 153 చేయాల్సి ఉంది. ఎమ్మెల్సీ స్థానాలు కూడా 40 నుంచి 50 దాకా పెంచాల్సి ఉంది. రెండు సభల్లో సంఖ్య పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆదివారం శాసన మండలిలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కూడా లేఖలు రాసినట్లు వివరించారు. కొత్త జిల్లాలను కచ్చితంగా ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
12% రిజర్వేషన్లపై తీర్మానం చేద్దాం
ఎస్టీ, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కేబినెట్‌తోపాటు ఉభయ సభల్లో తీర్మానం చేద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. ఈ రిజర్వేషన్లపై రెండు కమిషన్లను నియమించామని, త్వరలోనే వాటి నివేదికలు రానున్నాయని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆదివారం శాసన మండలిలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘మనం ఇతరులు ప్రశ్నించడానికి వీల్లేని సమాచారం సేకరిస్తే ఈ రిజర్వేషన్ల అమలు సులభం అవుతుందని జాతీయ మైనారిటీ కమిషన్‌లో పని చేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి శామ్యూల్ చెప్పారు. లేకపోతే న్యాయ వివాదాలు, ఇతర వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. దానిపై బలంగా వాదిస్తున్నాం. వాటిని కాపాడుకుంటూనే 12 శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తున్నాం. కమిషన్ల నివేదికలు రాగానే ప్రత్యేకంగా శాసన మండలి, శాసన సభ, కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపుదాం. అవసరమైతే ప్రధానిని స్వయంగా కలసి అడుగుదాం. మన రాష్ట్ర జనాభా, అవసరాలకు అనుగుణంగా మేం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతాం. కేంద్రం ఓకే చెబితే వారికి ధన్యవాదాలు చెబుతాం. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సాధించుకుందాం’’ అని అన్నారు.