తెరాస ముఖ్యులతో కేసీఆర్ సమావేశం
బంద్, జాతీయ స్థాయి పరిణామాలపై చర్చ
కాంగ్రెస్ నేతల బలహీనతలవల్లే రాయల తెలంగాణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడిని మరింత పెంచాల్సిందేనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు నివాసంలో టీఆర్‌ఎస్ ముఖ్యులతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. గురువారంనాటి బంద్, వివిధ పార్టీల వైఖరి, తెలంగాణపై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరు వంటి పరిణామాలపై ఈ సందర్భంగా కేసీఆర్ విశ్లేషించారు. తెలంగాణ జిల్లాల్లో బంద్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. బంద్ పిలుపుతో పాటు టీఆర్‌ఎస్ జరుపుతున్న నిరసనల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనా ఒత్తిడి పెరిగినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
రాయల తెలంగాణను వ్యతిరేకించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మరింత ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 6న జరిగే టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, ప్రజాప్రతినిధుల సమావేశం అంశాలపైనా స్థూలంగా కేసీఆర్ చర్చించారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు రిటైర్డు ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, ఏకే గోయల్, రామలక్ష్మణ్, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహ్మారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, రిటైర్డు చీఫ్ ఇంజనీరు ఆర్.విద్యాసాగర్‌రావు, యువజన విద్యార్థి విభాగాల అధ్యక్షులు బొంతు రామ్మోహన్, బాల్క సుమన్, గాయకులు దేశ్‌పతి శ్రీనివాస్ ఉన్నారు.
సీఎం కుర్చీ కోసం ఎత్తులవల్లే రాయల తెలంగాణ: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాట తప్ప రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు విమర్శించారు. రాయల తెలంగాణ ఏర్పాటు వద్దంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డి. శ్రీనివాస్ వంటివారు కుర్చీకోసం ఎత్తులు వేయడం తప్ప రాష్ట్ర ఏర్పాటును పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణ నేతల బలహీనత వల్లే రాయల తెలంగాణ తెరపైకి వచ్చిందని విమర్శించారు. గురువారం బంద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ దిరిగేలా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ ప్రాంత న్యాయవాదులంతా విధులను బహిష్కరించి పెద్దఎత్తున ర్యాలీలను నిర్వహించాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.