బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలా?
- రైతుల ఆత్మహత్యలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా?
- ఆదుకోలేక అడ్డగోలు విమర్శలు: కిషన్‌రెడ్డి
- ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో ధర్నా
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ఆత్మహత్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఇందిరాపార్కు దగ్గర మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో కలసి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్షలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో కొత్త రుణాలు దొరకక.. మరోవైపు తీవ్ర కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నుంచి రైతులను కాపాడాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరితే రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీపై అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు చేతనైతే ఆత్మహత్యలు ఆపాలని కిషన్‌రెడ్డి సూచించారు. ధనిక రాష్ట్రంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, అండగా ఉంటానని సీఎం కేసీఆర్ రైతులకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేయడం, బెదిరింపులు, వేధింపులతో ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీలోకి చేర్చుకోవడంపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు.
నేను నాకుటుంబం, నేను నా పార్టీ అనేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట రుణాలను ఏకకాలంలో చెల్లించాలని, కొత్త రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్‌ఎస్‌కు తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నేతలు సుగుణాకర్‌రావు, మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆత్మహత్యలు చేసుకున్న 34 మంది రైతులకు సంబంధించిన కుటుంబాలు దీక్షలో పాల్గొన్నాయి.