డూప్లెక్స్‌లపై కేజ్రీవాల్ వెనుకంజ
సాక్షి, న్యూఢిల్లీ: విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తనకు కేటాయించిన ఐదు పడకగదుల డూప్లెక్స్ ఫ్లాట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ వేశారు. సన్నిహితులు, మద్దతుదారుల సలహా మేరకు వాటిని తీసుకోరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం ఆయన మీడియా వద్ద ప్రకటించారు. తనకు కాస్త చిన్నపాటి నివాసాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. అంత వరకు ఘజియాబాద్‌లోని తన సొంత ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. పెద్ద ఇంటికి మకాం మార్చరాదని సన్నిహితులు, మద్దతుదారులు శుక్రవారం నుంచి తనకు ఫోన్లు చేస్తున్నారని, సందేశాలు పంపుతున్నారని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని భగవాన్‌దాస్ రోడ్డులో రెండు ఐదు పడకగదుల డూప్లెక్స్ ఫ్లాట్లను ఒకటి ఆయన నివాసానికి, మరొకటి కార్యాలయానికి కేటాయించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ వాటిని స్వీకరించేందుకు సిద్ధపడటంపై బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శలు సంధించారు. నిరాడంబరతను ప్రవచించే ‘ఆప్’ వ్యవస్థాపకుడు విలాసవంతమైన ఫ్లాట్లను స్వీకరించేందుకు సిద్ధపడటాన్ని వేలెత్తి చూపింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అంశమై కేజ్రీవాల్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, విలాసవంతమైన డూప్లెక్స్ ఫ్లాట్లు స్వీకరించేందుకు తొలుత ఇష్టపడిన కేజ్రీవాల్, ఆ తర్వాత వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతకు భయపడి మాట మార్చారని బీజేపీ నేత బల్బీర్ పుంజ్ విమర్శించారు. కాగా, అనుభవ రాహిత్యం వల్ల అనేక హామీలు ఇచ్చిన ‘ఆప్’ నేతలకు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అసలు విషయం తెలిసి వస్తోందని, అందుకే తొలుత ఇళ్లు, కార్లు తీసుకోరాదని అన్నవారు ఇప్పుడు మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అధికారిక నివాసాలు, వాహనాలు స్వీకరించబోమని తామెన్నడూ చెప్పలేదని, పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద ఇళ్లు తీసుకోబోమని మాత్రమే చెప్పామని ‘ఆప్’ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు.