పార్లమెంట్‌పై ‘ఆప్’నజర్ | AAP to contest 'maximum' Lok Sabha seats, Kejriwal not to fight | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌పై ‘ఆప్’నజర్

Published Sun, Jan 5 2014 3:24 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

పార్లమెంట్‌పై ‘ఆప్’నజర్ - Sakshi

పార్లమెంట్‌పై ‘ఆప్’నజర్

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తాజాగా పార్లమెంటుపై గురిపెట్టింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని సంకల్పించింది. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘ఆప్’ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ‘ఆప్’ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రాల కన్వీనర్లు పాల్గొన్నారు. సమావేశంలో తొలిరోజు తీసుకున్న నిర్ణయాలను పార్టీ నేతలు ప్రశాంత్ భూషణ్, సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. పార్టీ ఆవిర్భవించిన ఏడాదిలోనే ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న ‘ఆప్’పై రాష్ట్రాల్లో మంచి స్పందన కనిపిస్తోందని, పార్టీలో సభ్యత్వాలకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని రాష్ట్రాల నుంచి వచ్చిన కన్వీనర్లు చెప్పినట్లు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం...
 
 జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముగింపు రోజైన ఆదివారం ఎన్నికల వ్యూహంపై ‘ఆప్’ తుది నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వీలైనన్ని ఎక్కువ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది.
 
 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను పది-పదిహేను రోజుల్లో విడుదల చేయనుంది. అభ్యర్థుల ఖరారు కోసం వచ్చేనెల ప్రతి రాష్ట్రంలోనూ సమావేశాలు నిర్వహిస్తుంది. క్రిమినల్ కేసులు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి, నైతిక వర్తనకు సంబంధించిన మరకలు ఉన్నవారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు.
 
 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే ప్రతి నియోజకవర్గానికీ వేర్వేరుగా మేనిఫెస్టోలు రూపొందిస్తుంది.
  కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన ‘ఆప్’పై పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు ఉత్సుకత చూపుతున్నారు. పార్టీలో సభ్యత్వం కోసం ఆసక్తి చూపుతున్నారు.
 
 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలన్నదే ‘ఆప్’ విశ్వాసం
 
 కాగా, ‘ఆప్’ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, తమిళనాడు నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాల్లో కేజ్రీవాల్ మంత్రివర్గ సహచరుడు మనీష్ సిసోడియా, పార్టీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, అంజలి దామానియా, మయాంక్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయను: కేజ్రీవాల్
 న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్నానని ‘ఆప్’ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై అభిమానం కొద్దీ యోగేంద్ర యాదవ్ తనను ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ లేదా నరేంద్ర మోడీ లేదా కేజ్రీవాల్‌లలో ఎవరు ప్రధాని పదవి చేపడతారనేది నేటి రాజకీయాల్లో ముఖ్యం కాదని, అవినీతిపై పోరు, ధరల పెరుగుదలను అరికట్టడమే ముఖ్యమని అన్నారు.
 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement