కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం
- అసెంబ్లీలో బీఫ్‌తో చేసిన వంటకాలు తిన్న ఎమ్మెల్యేలు
తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తోందంటూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేరళ అసెంబ్లీ మండిపడింది. పశు విక్రయాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఖాతరు చేయబోమని కేరళ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించగా, గురువారం మరో అడుగు ముందుకువేసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో.. కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అధికార ఎల్డీఎఫ్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి విపక్ష యూడీఎఫ్ కూడా మద్దతు పలకడం గమనార్హం.
కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవడం తగదని ఆయన అన్నారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని భగ్నం చేసే ఏ నిర్ణయాన్నయినా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
బీఫ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యేలు
పశు విక్రయాలు, బీఫ్ సహా ఇతర మాంసం విక్రయాలపై అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నదంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేరళ ప్రజాప్రతినిధులు. గురువారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు.. గొడ్డుమాంసం(బీఫ్)తో వండిన వంటకాలను అల్పాహారంగా స్వీకరించారు. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చించాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.