నిజమైన భారతీయులు ఆ రాష్ట్రం వారే!
ప్రెస్ కౌన్సిల్ మాజీచైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టు బాగా హల్ చల్ చేస్తోంది. కేరళ వాసులే 'నిజమైన భారతీయుల'ని కీర్తిస్తూ ఆయన ఈ పోస్టులో ప్రశంసల వర్షం కురిపించారు.
'నిజమైన భారతీయులు' టైటిల్ కు కేరళ వాసులు ఎందుకు అర్హులో వివరిస్తూ.. భారతీయులకు ఉండాల్సిన సహజ లక్షణాలెన్నో వారిలో ఉన్నాయని, ఒకరితో ఒకరి కలిసిమెలిసి సామరస్యంతో జీవించే గొప్ప భారతీయ గుణం కేరళ వాసుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ మతాలు, కులాలు, జాతులకు చెందిన ప్రజలు కేరళలో కలిసిమెలిసి జీవించడం గమనించవచ్చునని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకుసాగుతున్న వారి విశాల దృక్పథాన్ని మిగతా దేశం కూడా అవలంబించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టుతో కేరళ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కట్జూ వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. లైకులు, షేరింగులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కట్జూ పోస్టుకు 21వేల లైకులు, 14,400 షేరింగులు రాగా.. అందులో అత్యధికంగా కేరళ మిత్రుల నుంచే ఉన్నాయని అంటున్నారు. అయితే, ఈ పోస్టులో ఈశాన్య రాష్ట్రాల గురించి జస్టిస్ కట్జూ మాటమాత్రమైన ప్రస్తావించకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.