నేను.. కిడ్నాప్ అయ్యానోచ్..
తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్న చిన్నారులు
దుష్ర్పభావం చూపుతున్న టీవీ సీరియళ్లు, సినిమాలు
ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు
ఏలూరు: ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం, రూ.లక్ష ఇస్తే వదిలిపెడతాం..’ అన్న ఫోన్ రాగానే ఆ తల్లిదండ్రుల గుండెలు గుభిల్లుమన్నాయి. వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్‌కు పరుగులు తీశారు. ఫోన్ వచ్చిన నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడే పోలీసులు, తల్లిదండ్రులకు కళ్లు తిరిగే షాక్ తగిలింది. అదే చదవండి..
సమాజంలో వస్తోన్న అవాంఛనీయ మార్పులు, చోటు చేసుకుంటున్న దురదృష్టకర సంఘటనలు పసి మొగ్గలపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. నియంత్రణ కరువైన క్రమంలో సినిమాలు, టీవీలలో ప్రసారమవుతోన్న నేరాలు, ఘోరాలు కల్లా కపటం తెలియని చిన్నారుల నిర్మల హృదయాలను కలుషితం చేస్తున్నాయి. ఇందుకు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో తాజాగా జరిగిన రెండు సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
గడచిన నెలలో ఒక బాలుడి తల్లిదండ్రులు త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌కు పరుగులు పెడుతూ వచ్చారు. నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుకుంటున్న తమ చిన్నారి కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని, ఫోన్‌లో బెదిరింపు కాల్ వచ్చిందని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలుణ్ణి కిడ్నాప్ చేశామనే కాల్ వచ్చిన మొబైల్ నంబరు ఏ ప్రాంతానిదో గుర్తించారు. అది విజయవాడ పరిసర ప్రాంతంలో ఉందని గుర్తించి తల్లిదండ్రులతో కలిసి అక్కడికి చేరుకుని సెల్ సిగ్నల్స్ ఆధారంగా బాలుడున్న ప్రదేశానికి చేరుకున్నారు. తీరా అక్కడ ఆ బాలుడు తన స్కూలు స్నేహితుడితో కలిసి దాక్కుండడం గుర్తించారు.
కిడ్నాప్ ఉదంతం ఒట్టిదని కుర్రాడే కి డ్నాప్ డ్రామా ఆడాడని తెలిసి పోలీసులతో పాటు వాడి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్కారు. కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడావని పోలీసులు పిల్లవాడిని గదమాయిస్తే అసలు విషయం చెప్పాడు. తాను చూసే టీవీ సీరియల్‌లో కుర్రాడు కిడ్నాప్ అయితే వాడి తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోయారని, తాను కిడ్నాపైతే తన వాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఇలా చేశానని చెప్పాడు.
మరో సంఘటన..
ఇదే క్రమంలో నగరంలో మరో పోలీసుస్టేషన్‌లో నమోదైన చిన్నారి కిడ్నాప్ ఉదంతం మరో ట్విస్ట్‌తో సుఖాంతమైంది. యథావిధంగా తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ ముద్దుల కొడుకును ఎవరో కిడ్నాప్ చేసి ల క్ష రూపాయలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ ఆధారంగా కేవలం గంట వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడు డబ్బుల కోసం కిడ్నాప్ నాటకం నడిపాడని తె లుసుకుని పిల్లల్ని సక్రమంగా పెంచాలని తల్లిదండ్రులకు క్లాసు ఇచ్చి పంపేశారు.
పిల్లల్ని గమనిస్తూ ఉండాలి
ప్రస్తుత బిజీ లైఫ్‌లో పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ కొరవడుతోంది. దీంతో వారు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని సీరియళ్లలో ఘటనలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి నిదర్శనమే గత నెలలో జిల్లాలో జరిగిన కిడ్నాప్ డ్రామాలు. ఇటువంటివి జరగకుండా పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వారి నడవడికను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి.
- ఎం.సాగరబాబు, త్రీ టౌన్ ఎస్సై, ఏలూరు