
విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు
బెంగళూరు: రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూతపడ్డ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌లో వాటాను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా మంగళవారం చెప్పారు. ఇందుకు వీలుగా ఓ విదేశీ ఇన్వెస్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్ పేరు వెల్లడించలేదు. రానున్న మూడు నెలల్లో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు. యూబీ గ్రూప్ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాల్యా ఈ విషయాలను వెల్లడించారు. వాటా విక్రయ విషయమై గతంలోనూ కొన్ని కంపెనీలతో చర్చలు జరిపినప్పటికీ సఫలంకాలేదని చెప్పారు.
కాగా, మరోవైపు 100 మంది కింగ్‌ఫిషర్ ఉద్యోగులు బుధవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. గత 14 నెలలుగా జీతాలు చెల్లించకపోగా, ఈ విషయంపై యాజమాన్యం తగిన రీతిలో స్పందించడంలేదని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. తలకు మించిన రుణాలు, నష్టాల భారంతో గతేడాది అక్టోబర్‌లో కంపెనీ మూతపడ్డ విషయం విదితమే.